YS Jagan : అభిమానానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరితే అది అపహాస్యం అవుతుంది. ఈ విషయంలో జగన్ బాధితుడే కానీ.. అభిమానంతో పిచ్చి పనులు చేసిన వారు కూడా బాధితులయ్యారు. జగన్ పై అభిమానంతో చేసిన కోడి కత్తి దాడి వికటించింది. ఆ దాడితో జగన్ రాజకీయ ప్రయోజనాలు పొందాడు. కానీ జగన్ కళ్ళల్లో ఆనందం చూస్తాం అనుకున్న శ్రీనివాస్ మాత్రం ఐదేళ్ల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయాడు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడో.. అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఆ శ్రీనివాస్ కు మోక్షం దక్కలేదు. బెయిల్ లభించలేదు. బహుశా ఈ దేశంలో ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఐదేళ్ల పాటు ఉండిపోవడం ఇదే మొదటిసారి ఇలా కనిపిస్తోంది. అయితే దీనిని పక్కన పెడితే… జగన్ అంటే చెయ్యి కోసుకునే జనం చాలామంది ఉన్నారు. ఆయనపై పిచ్చి ప్రేమతో లక్షలాదిమంది గడుపుతున్నారు. మొన్నటి ఓటమిలో 40 శాతం మంది ఆయనకు మద్దతు తెలిపారు. ఓటమి ఎదురైనా ఇప్పటికీ ఆయన అంటే ప్రాణమిచ్చే వారు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అత్యంత ప్రజాకర్షక నేతల్లో జగన్ ఒకరు. ఈ ఎన్నికల్లో ఆయనకు సీట్లు తగ్గినా.. ఘోర పరాజయం ఎదురైనా.. ఆయనపై అభిమానం తగ్గలేదు. ఆయన అభిమానుల్లో మార్పు రాలేదు. అదే ప్రేమ, అదే దూకుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోతెగ ఆకట్టుకుంటుంది. జగన్ పై అభిమానులకు ఉండే ప్రేమను తెలియజేస్తోంది.
* యువకుడి హల్ చల్
ఇటీవల ఓ పర్యటనకు వెళ్లారు జగన్. దారి పొడవునా అభిమానులు చుట్టుముట్టారు. కారు పైనుంచే అభివాదం చేశారు జగన్. అభిమాన నేతతో చెయ్యి కలిపేందుకు.. సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. యువత అయితే ఈలలు, గోల తో సందడి చేశారు. ఇంతలో కారు ఎక్కిన ఓ యువకుడు జగన్ ను ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువకుడు చేసిన జగన్ సైతం షాక్ అయ్యాడు. తృటిలో ప్రమాదం తప్పించుకున్నాడు. అదే జరిగితే మరో గులకరాయి దాడి అయి ఉండేది.
* ఎప్పటికప్పుడు ఇలానే
అయితే జగన్ పై ఈ తరహా దూకుడు ఇప్పుడే కాదు. నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ సమయంలో జిల్లా జైలు వద్ద జగన్ పై ఓ యువకుడు దూసుకు వచ్చాడు. దాడికి వచ్చాడని భావించి భద్రతా సిబ్బంది ఆ యువకుడ్ని అడ్డుకున్నారు. అడ్డగించి నిలువరించే ప్రయత్నం చేశారు. తీరా ఆయన జగన్ అభిమాని అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
అయితే జగన్ విషయంలో భద్రతా సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతం. జగన్ పర్యటనలలో కనిపించేవారు ఎవరు అభిమానులో? ఎవరు దాడికి వస్తున్నారో? తెలియని పరిస్థితి వారిది. అందుకే వారిని నియంత్రించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. విధులు కత్తి మీద సాములా మారుతున్నాయి. దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More