AP Elections 2024: ఏపీ నుంచి వారికే కేంద్ర మంత్రులుగా ఛాన్స్!

పొత్తులో భాగంగా బిజెపి ఆరు స్థానాలకు పోటీ చేసింది. జనసేన రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. టిడిపి మాత్రం 17 చోట్ల బరిలో దిగింది. అయితే బిజెపి నుంచి ఒకరికి బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : May 24, 2024 3:42 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 4 న ఫలితాలు ప్రకటించనున్నారు. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. టిడిపి కూటమి తప్పకుండా గెలుస్తుందని మూడు పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు మరోసారి తాము అధికారంలోకి వస్తామని జగన్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఏపీ ఫలితాలు అటు ఉంచితే.. కేంద్రంలో మరోసారి బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతోంది. దీంతో ఏపీ నుంచి ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయోనన్న చర్చ ప్రారంభమైంది.

పొత్తులో భాగంగా బిజెపి ఆరు స్థానాలకు పోటీ చేసింది. జనసేన రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. టిడిపి మాత్రం 17 చోట్ల బరిలో దిగింది. అయితే బిజెపి నుంచి ఒకరికి బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి. ఒకవేళ పురందేశ్వరి గెలిస్తే ఆమెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అటు కిరణ్ గెలిచినా బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది.

జనసేనకు సంబంధించి కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుండి వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలశౌరి సీనియర్ కావడంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారని నాకు నడుస్తోంది. ఒకవేళ ఏపీలో కూటమి లెక్కలు మారితే పవన్ ను కేంద్ర మంత్రిగా ఖాయం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని.. కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తారని మరో ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి.. కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన లాబీయింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు, బి.కె పార్థసారథి వంటి వారు సైతం కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఒకలా.. లేకుంటే మరోలా కేంద్ర క్యాబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.