Polavaram Project Name: పోలవరం ప్రాజెక్టు( polavaram project) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఎనలేని సహకారం అందిస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు పేరు విషయంలో రకరకాల చర్చ నడుస్తోంది. ప్రతి రాజకీయ పార్టీ పేరు విషయంలో అనేక రకాలుగా సిఫార్సులు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గుర్తింపులో పోలవరం ప్రాజెక్టు గానే ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ కేంద్రం ఆమోదించలేదు. ఇంతవరకు పేరు మారలేదు కూడా. దీంతో రకరకాల పేర్లు పెట్టాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం. ఆపై కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సైతం ప్రభావం చూపెడుతోంది.
ఏపీ ప్రజల జీవనాడి..
పోలవరం ప్రాజెక్టు అనేది ఏపీ ప్రజల జీవనాడి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి( Godavari), కృష్ణా నదుల అనుసంధానం కూడా జరిగింది. ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుకు మహనీయుల పేరు పెట్టాలన్నది డిమాండ్. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ సాగర్ పేరు పెట్టాలని అనుకున్నారు. అయితే తరువాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. మంత్రివర్గం సమావేశంలో కూడా తీర్మానం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడుతూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వ గుర్తింపులో మాత్రం ఆ పేరు చేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు గానే కొనసాగుతూ వచ్చింది.
చివరి దశకు పనులు..
అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపు చివరి దశకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ( Potti sriramulu )పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రం కోసం అమరజీవి తన ప్రాణాలను త్యాగం చేశారని.. అటువంటి వ్యక్తి పేరు జిల్లాకు, ప్రాంతానికి పెడితే సరిపోదని.. ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆ పేరు పెడితే చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఆర్యవైశ్యులు జనసేనలో చేరే క్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు. అంటే అమరజీవి కోసం జనసేన గట్టిగానే పట్టుబడుతోంది.
వాజ్పేయి పేరు..
మరోవైపు బిజెపి( Bhartiya Janata Party) నుంచి ఇంకో డిమాండ్ వినిపిస్తోంది. నదుల అనుసంధానికి ఈ దేశంలో ఆధ్యుడు అటల్ బిహారీ వాజ్పేయి. ప్రస్తుతం ఆయన శతజయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బిజెపి నుంచి డిమాండ్ వస్తోంది. బిజెపి అగ్రనాయకత్వం కోరిన మరుక్షణం చంద్రబాబు అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఇటీవలే ఆవిష్కరణ జరిగింది. అయితే ఇప్పుడు జనసేన నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు, బిజెపి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి పేరు ప్రతిపాదనలు రావడంతో.. చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.