Rajamandri : పాఠశాలలతో( schools) సమానంగా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. కన్న తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసే కుమారులు.. అత్తమామలను చూసుకోలేని కోడళ్ళు.. చేతకాని వయసులో ముసలి వాళ్లు అనే కనికరం లేకుండా వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. నెలకు కొంత డబ్బు పడేసి చేతులు దులుపుకుంటున్నారు. వృద్ధాశ్రమాలు పెరగడానికి ఇదే కారణం. మలి వయసులో, ఆరోగ్యం సహకరించక అవస్థలు పడుతున్న సమయంలో.. నా అనే వారు చూసుకోక ఆ వృద్ధులు పడే బాధలు ఎవరికీ చెప్పుకోలేనివి. ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు.. ఎన్ని ఆస్తులు పోగేసాం అన్నది ప్రధానం కాదు. కానీ చివరి దశలో ఓ ముద్ద అన్నం పెట్టని చేతులు కూడా చాలానే ఉంటాయి. అలాంటివారికి వృద్ధాశ్రమాలే దిక్కువుతున్నాయి.
* ఒక్కొక్కరిది ఒక్కో గాధ
వృద్ధాశ్రమాల్లో( old age homes) ప్రతి ఒక్కరిది ఒక గాధ. దాని వెనుక ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే అయినవారు, పిల్లలు కనిపించని ఆ వృద్ధాశ్రమాల్లో తోటి వారిలోనే వారిని వెతుక్కుంటున్నారు. వృద్ధాశ్రమాల్లోని ఆ పండుతాకులకు అసలైన స్నేహితులు దొరుకుతున్నారు. అయితే ఓ వృద్ధాశ్రమంలో అయితే ఆరు పదుల వయసు దాటిన ఓ ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజమండ్రిలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఉంది. ఎంతోమంది వృద్దులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఓ 68 ఏళ్ల వృద్ధురాలిని.. 64 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ ఆశ్రమంలోనే కలుసుకోగా.. వారి మనసులు కూడా కలిశాయి. చివరి వయసులో ఒకరికి మరొకరు తోడుగా ఉండాలని వారు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి జరిపించగా.. అందులో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారారు.. ఆ వృద్ధ జంటను ఒకటి చేశారు.
* అలా కలిశారు
వైయస్సార్ కడప జిల్లా( YSR Kadapa) పెనగలూరు మండలం కమ్మలగుంట గ్రామానికి 68 ఏళ్ల గజ్జల రాములమ్మ.. రాజమండ్రి సమీపంలో నారాయణపురం గ్రామానికి చెందిన 64 ఏళ్ల మడగల మూర్తి ఇటీవల వృద్ధాశ్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారిద్దరూ గత కొన్నేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నారు. గత రెండేళ్లుగా మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఒకరి సాయం లేనిదే ఆయన ఏ పని చేసుకోలేడు. ఇటువంటి సమయంలో మూర్తికి రాములమ్మ అన్ని రకాల సఫర్యలు చేసింది. దీంతో ఆయన కోలుకున్నాడు.
* వారిద్దరూ ఒకరిపై ఒకరికి ప్రేమ
అయితే తనకు ఎవరూ లేని సమయంలో తోడుగా నిలిచినందుకు రాములమ్మ పై( Ramulamma ) మూర్తి ప్రేమ పెంచుకున్నాడు. ఇక రాములమ్మకు కూడా మూర్తిపై మంచి అభిప్రాయం ఉంది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకుడు రాంబాబుకు చెప్పారు వారిద్దరు. దీంతో ఆయన దగ్గరుండి వారిద్దరి వివాహం జరిపించారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులు ఆ వృద్ధ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది.