Palnadu District : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలి. వారి ఆలనా పాలనా చూడాలి. వారికి సేవ చేయాలి. కానీ ఆ వృద్ధ తల్లిదండ్రులది ఆ పరిస్థితి కాదు. 8 పదుల వయసులో తిరిగి వారి పిల్లలకు సేవ చేయాల్సి వచ్చింది ఆ వృద్ధ తల్లిదండ్రులకు. అలాగని వారి పిల్లలు చిన్నవారు కాదు. ఐదు పదులు దాటిన వారే. పుట్టుక నుంచే వింత వ్యాధికి గురై మంచానికి పరిమితం అయ్యారు. అప్పటినుంచి ఆ దంపతులు పిల్లలకు సేవలు చేస్తూనే ఉన్నారు. ఈ ముదిమి వయసులో సైతం పిల్లల సేవలో తరిస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంతలో వెలుగు చూసింది ఈ విషాద ఘటన.
* పుట్టుకతోనే నయం కాని వ్యాధి
గ్రామానికి చెందిన ధూళిపాళ్ల రామయ్య, వెంగమ్మ దంపతులకు 80 సంవత్సరాల పైగా వయసు ఉంటుంది. వీరికి పేరయ్య, సీతయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు అనే నలుగురు పిల్లలు ఉన్నారు. పుట్టుకతోనే నయం కాని వ్యాధితో మంచానపడ్డారు. ప్రస్తుతం వారి వయసు 50 ఏళ్లకు దాటింది. మరోవైపు తల్లిదండ్రులు వయోభారంతో బాధపడుతున్నారు. మొన్నటి వరకు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇప్పుడు వృద్ధాప్యంతో ఏ పనులు చేయలేకపోతున్నారు. అతి కష్టం మీద నలుగురు పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. వారి పరిస్థితిని చూసిన వారికి కన్నీళ్లు ఆగవు.
* మంచం మీద నుంచి సేవలు
ఆ నలుగురు పిల్లలకు వివాహాలు జరిగి ఉంటే.. ఈపాటికి పిల్లలతో కళ కళ లాడేది ఆ ఇల్లు. కానీ వారికి ఆ అదృష్టం లేదు. చిన్నప్పటినుంచి మంచానికి పరిమితం అవుతూ గడుపుతున్నారు నలుగురు పిల్లలు. ప్రస్తుతం వారి వయసు 50 సంవత్సరాలు దాటుతుంది. కనీసం మంచం మీద నుంచి లేచి తమ పనులు తాము చేసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో వయోభారంతో బాధపడుతున్న ఆ వృద్ధ తల్లిదండ్రులు సఫర్యలు చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పరిస్థితిని చూసి.. మనసు అంగీకరించక.. అలాగని వారి కింద చేయలేక సతమతమవుతున్నారు.
* అందని పింఛన్లు
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలకి పింఛన్లు వచ్చేవి. వారి పరిస్థితిని ప్రత్యేకంగా తెలుసుకున్న అప్పటి సీఎం చంద్రబాబు వారికి పింఛన్ల మంజూరు విషయంలో నిబంధనలు సడలించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్ అందుతోంది. ప్రస్తుతం వృద్ధ తల్లిదండ్రులు వ్యవసాయ పనులు కూడా చేయలేకపోతున్నారు. దీంతో ఆర్థికంగా చేదోడు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆ ముగ్గురు కొడుకులకైనా పింఛన్లు మంజూరు చేయాలని ఆ వృద్ధ తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.