
Nara Lokesh Padayatra: అసలు అంత దూరం నడవగలడా? అని ఒకరు. ప్రజల మధ్య మాట్లాడగలడా? అని మరొకరు. అంత సీన్ లేందంటూ ఇంకొకరు. నారా లోకేష్ పాదయాత్ర గురించి రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ఇవి. కానీ వాటన్నింటి అధిగమించి లోకేష్ తన యువగళం పాదయాత్రను 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. పాదయాత్రలో పావు వంతు పూర్తిచేశారు. విపక్షాలకు గట్టి సమాధానమే ఇచ్చారు. మొదట్లో ఆయన పాదయాత్ర చేయగలరా అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లోనే ఉండేది. ఎందుకంటే ఆయనపై అంతలా ఇతర పార్టీలు నెగెటివ్ ప్రచారం చేశాయి. చివరకే బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేశారు. . వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కానీ సహనంతో ఓర్చుకున్నారు. పాదయాత్ర ద్వారా ధీటైన సమాధానం ఇస్తున్నారు. విశ్రాంతి లేకుండా నడుస్తున్నారు. రోజంతా ప్రజలతోనే గడుపుతున్నారు.
రాయలసీమలో సక్సెస్..
అధికార పార్టీకి పట్టున్నట్టు భావిస్తున్న రాయలసీమలో లోకేష్ పాదయాత్ర దాదాపు చివరి దశకు వస్తోంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర అనంతపురంలో సైతం ముగిసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతోంది. చివరకు కడపలో పూర్తిచేయడం ద్వారా రాయలసీమలో పాదయాత్ర ముగుస్తుంది. అయితే లోకేష్ సాహసించి రాయలసీమలో పాదయాత్రకు దిగడం మంచి ఫలితాలనే ఇచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి దోహదపడింది. అయితే లోకేష్ కు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదో అనుకున్నాం.. కానీ లోకేష్ పట్టుబట్టి మరీ పాదయాత్ర గా ముందుకు సాగుతుండడాన్ని చూసి వారే ముచ్చటపడుతున్నారు. ప్రారంభంలో ఆటంకాలు సృష్టించినా ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి లేదు. అటు లోకేష్ సైతం అన్నివర్గాల ప్రజలను కలుస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు.

వైసీపీ ప్రయత్నాలు చేసినా..
లోకేష్ పాదయాత్రను ఫెయిల్ చేయడానికి వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. రకరకాలుగా ట్రోల్స్ చేసింది. ఇలా ట్రోలింగ్ చేయడానికే వైసీపీ సోషల్ మీడియా విభాగం 1000 మంది వరకూ ట్రోలర్స్ ను నియమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంటలిజెన్స్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, నేతలను పంపించి లోకేష్ తో వాగ్వాదానికి ప్రోత్సహిస్తున్నారు. అయితే లోకేష్ ఎక్కడ తొందరపాటు పడడం లేదు. ప్రతీచోటా వారి వాదనను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సహనంతో సమాధానాలు చెబుతున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది…ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నది సవివరంగా చెప్పి వారిని సంతృప్తి పరుస్తున్నారు.
టీడీపీ శ్రేణుల్లో సంతృప్తి
లోకేష్ పై పనిగట్టుకొని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ అవన్నీ వర్కవుట్ కాలేదు. కోట్లు ఖర్చుపెట్టినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు. నెగిటివ్ ప్రచారం కల్పించే క్రమంలో లోకేష్ కు మంచే చేశారు. ఒకవైపు నిర్విరామంగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్న లోకేష్ అంచనాలకు మించి వ్యవహరిస్తున్నారు. పరిణితిని ప్రదర్శిస్తున్నారు. అటు టీడీపీ శ్రేణులు సైతం లోకేష్ చర్యలపై సంతృప్తిగా ఉన్నాయి. ప్రస్తుతం 1000 కిలోమీటర్ల పాదయాత్రే పూర్తయ్యింది. అదే అనుకున్న లక్ష్యం 4 వేల కిలోమీటర్ల మైలురాయి దాటే క్రమంలో లోకేష్ మాస్ లీడర్ గా ఎదిగే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.