5 Star Facility For MP Mithun Reddy: ‘మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. వేలకోట్లను దోచేశారు. అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. వారికి కఠిన శిక్ష పడాల్సిందే. ప్రజల రక్త మాంసాల మీద వ్యాపారం చేసిన వారికి నరకం కనిపించాలి.. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి.. మద్యాన్ని ఒక వ్యసనం లాగా మార్చారు. వారికి సంబంధించిన కంపెనీలకే మద్యం తయారు చేసే కాంట్రాక్టులు ఇచ్చారు. చివరికి వేలకోట్ల దందాకు పాల్పడ్డారు’ ఇవీ కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి చేసిన విమర్శలు.. చేస్తున్న విమర్శలు.
వారు చేస్తున్న విమర్శలకు తగ్గట్టుగా అడుగులు ఉంటున్నాయా అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం లభించదు.. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇప్పటికీ కొన్ని అరెస్టులు జరిగాయి. భవిష్యత్తు కాలంలోనూ అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో కూడా తెలియదు. కాకపోతే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రముఖమైన వ్యక్తులలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఒకరు. ఈయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. పైగా ఈయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గతంలో మంత్రిగా పనిచేశారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.
విచారణ ఖైదీగా ఉన్న ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయనకు జైలు అధికారులు టీవీ సమకూర్చారు. బెడ్ ఏర్పాటు చేశారు. వెస్ట్రన్ కమోడ్ బాత్ రూం సౌకర్యం కల్పించారు. మూడు పూటలా బయట నుంచి భోజనం తెచ్చుకునే వెసలుబాటు కల్పించారు. మంచం సమకూర్చారు.. దోమల కుట్టకుండా దోమతెర.. యోగ మ్యాట్.. వాకింగ్ చేయడానికి బూట్లు.. చదవడానికి వార్తాపత్రికలు.. అతడిని పర్యవేక్షించడానికి ఒక వ్యక్తి.. వారానికి ఐదు రోజులు ఇద్దరు న్యాయవాదులతో స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం.. రెగ్యులర్ మెడిసిన్.. పుస్తకాలు.. పెన్నుల వంటి సదుపాయాలు కల్పించారు.. వాస్తవానికి ఆయన బయట ఉన్నప్పుడు కూడా ఇంత సదుపాయాలను పొంది ఉండరు. అలాంటిది ఒక కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి.. ఇలాంటి సదుపాయాలు కల్పించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సమయంలోనే మనదేశంలో న్యాయవ్యవస్థ అందరి విషయంలో ఒకే తీరుగా ఉండదని అర్థమవుతోంది.
Also Read: వార్నీ నీది కాపీ “ముచ్చటే”నా.. కూసింత సిగ్గుపడు వెటరన్ జర్నలిస్టు..
గతంలో చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు కూడా ఇలా సదుపాయాలు కల్పించలేదని టిడిపి నాయకులు అంటున్నారు.. ముఖ్యంగా ఆయన భోజనం చేసే విషయంలోనూ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. చివరికి కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి వచ్చిందని టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు. కానీ లిక్కర్ వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉన్న పార్లమెంట్ సభ్యుడికి ఈ స్థాయి సదుపాయాలు కల్పించడం నిజంగా ఆందోళన కలిగిస్తోందని.. అలాంటప్పుడు అతని జైల్లో వేసి మాత్రం ఉపయోగం ఏముందని టిడిపి నేతలు అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైనట్టేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.