https://oktelugu.com/

Ration Rice: మరో రేషన్ దందా.. ఈసారి విశాఖ పోర్టులో!.. భారీ మొత్తం

గత కొద్ది రోజులుగా రేషన్ బియ్యం మాఫియా రాజ్యమేలుతోంది. ఏపీలో ఇదే ప్రధాన అంశంగా మారింది. ఇటువంటి తరుణంలో విశాఖ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 10, 2024 / 10:00 AM IST

    Ration Rice

    Follow us on

    Ration Rice: ఏపీలో రేషన్ బియ్యం దందాకు చెక్ పడడం లేదు. వైసిపి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ దందాకు అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు. కాకినాడ పోర్టులో రేషన్ దందా కొనసాగుతుండగానే.. విశాఖ పోర్టులో మరో దందా వెలుగులోకి వచ్చింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అకాస్మాత్తుగా విశాఖ పోర్టును తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని గుర్తించారు. సీజ్ చేయాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. గత రెండు నెలలుగా కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో.. అక్రమార్కులు విశాఖపట్నం. కాకినాడ పోర్టుకు బదులుగా విశాఖ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు తాజాగా వెల్లడయ్యింది.

    * పవన్ పరిశీలనతో
    కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్. విదేశీ షిప్ ను సీజ్ చేయాలని కూడా ఆదేశించారు. కేంద్ర హోం శాఖకు లేఖ కూడా రాశారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. అణువణువునా పరిశీలిస్తోంది. అయితే కాకినాడ పోర్టు వ్యవహారం ఒక వైపు చర్చకు నడుస్తుండగా.. ఇంకోవైపు విశాఖ పోర్టులో సరికొత్త దందా వెలుగులోకి వచ్చింది.

    * రంగంలోకి కేంద్రం
    అయితే ఇప్పటికే రేషన్ బియ్యం దందాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎక్కడికక్కడే రేషన్ పక్కదారి వెలుగు చూస్తుండడంతో కఠిన చర్యలకు దిగుతోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోర్టుల్లో నిఘా మరింత పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్రం సైతం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.