Auto Drivers Welfare: ఏపీలో( Andhra Pradesh) ఆటో డ్రైవర్ల సాయానికి సంబంధించి పథకానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఏటా ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయల చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే పేరు పెట్టారు. డ్రైవర్ల సంక్షేమం కోసం రూపొందించిన ఈ కొత్త పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా పథకం అమలుకు నిర్ణయించారు. క్యాబినెట్ బేటిలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆటో, క్యాబ్, టాక్సీ వాహనదారులకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు లబ్ధి చేకూరనుంది.
* సొంత వాహనదారులకు..
ఆటో(Auto), క్యాబ్, టాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఆటోలతో పాటు మ్యాక్సీ క్యాబ్ లపై ఎక్కువగా వెళ్లే మహిళలు అటువైపు చూడడం లేదు. దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను చూసిన సీఎం చంద్రబాబు ఆదుకుంటానని తప్పకుండా హామీ ఇచ్చారు. దసరా నుంచి ఈ పథకం అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ వేదికగా ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి నిన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొనున్నారు.
* అత్యధిక లబ్ధిదారులు విశాఖలో..
‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి ఒక్కొక్కరికి 15వేల రూపాయల చొప్పున 436 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి అత్యధికంగా లబ్ధిదారులు విశాఖ జిల్లాలో ఉన్నారు. ఏకంగా అక్కడ 22,955 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. తరువాత స్థానంలో నెల్లూరు జిల్లా ఉంది. అక్కడ 17405 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16,405, విజయనగరంలో 15,479, శ్రీకాకుళంలో 13,887, అనకాపల్లిలో 13753, కర్నూలులో 13,495, గుంటూరులో 13,204, తిరుపతిలో 13,125, కాకినాడలో 12,966, తూర్పుగోదావరిలో 11915, కడపలో 11456, ప్రకాశం లో 11356, కృష్ణా లో 11316, ఏలూరులో 10,655, నంద్యాలలో 9569, అనంతపురంలో 9275, పల్నాడు లో 8884, పశ్చిమగోదావరిలో 8489, కోనసీమలో 7709, బాపట్లలో 6859, చిత్తూరులో 6777, పార్వతీపురం మన్యంలో 4963, అల్లూరి జిల్లాలో 4217 మందికి ఆటో డ్రైవర్ల సేవలో.. పథకంలో భాగంగా ఒక్కొక్కరికి 15వేల రూపాయలు జమ కానుంది.