2025 YSRCP Roundup: కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఏటా అనేక ఘటనల సమాహారంతో ఒక ఏడాది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు 2025 సైతం మరికొన్ని గంటల్లో కనుమరుగు కానుంది. అయితే గడిచిన కాలం ఎప్పటికీ గొప్పది. అందుకే ఎక్కువ మంది గతించిపోయిన రోజులను గుర్తు చేసి మురిసిపోతుంటారు. అయితే 2025 కూడా ఎన్నో రకాల ఘటనలకు సమాహారంగా నిలిచింది. ముఖ్యంగా వైయస్సార్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ ఏడాదికాలంలో చూపిన పాత్ర ఏంటి? అసలు పుంజుకుందా? ఆ ప్రయత్నం చేసిందా? అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఏ పార్టీకైనా ఒక సంవత్సర కాలం చాలా ముఖ్యం. అయితే ఈ ఏడాది కాలంలో వైసిపి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.
దారుణ పరాజయం..
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ దారుణంగా ఓడిపోయింది. 175 స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయితే 2024 లో అస్సలు పుంజుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఘనవిజయంతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది గనుక. కేవలం 6 నెలల వ్యవధిలో ఒక పార్టీ పనితీరును అంచనా వేయలేం. అందులోనూ ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టేందుకు ఒక ఆరు నెలల కాలం అవసరం. అందుకే గత ఏడాది ముగింపులో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరును అంచనా వేయలేం కూడా. అయితే 2025లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరంగా పనితీరు మెరుగు పడలేదు. కానీ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
పల్నాడు జిల్లాలో మైనస్
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ పార్టీ ఎంతో కొంత బలం కనిపిస్తోంది. పల్నాడు లాంటి జిల్లాలో పరిస్థితి పూర్తిగా దిగజారింది. అక్కడ పార్టీ ఫుల్ మైనస్ లోకి వెళ్లిపోయింది. అక్కడ కీలక నాయకుడుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కావడంతో.. మిగతా నేతలు సైతం కేసులకు భయపడి సైలెంట్ అయ్యారు. అక్కడ అంబటి రాంబాబు ఒక్కరే పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో అసలు ఇన్చార్జిలు ఉన్నారా లేరా అన్న పరిస్థితి నెలకొంది.
అక్కడ కూడా వెనుకబాటే.. ఉభయగోదావరి( combined Godavari) జిల్లాల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ చాలామంది కీలక కాపు నాయకులు పార్టీకి దూరమయ్యారు. పార్టీలో ఉన్నవారు ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు సైతం వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తున్నారు. అయితే గత ఏడాది ప్రారంభంలోనే సోషల్ మీడియా పై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో చాలామంది నేతలు, వైసీపీ యాక్టివిస్టులు అరెస్టయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన వారు సైతం పూర్తిగా సైలెంట్ గా మారిపోయారు. గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇదే మాదిరిగా పార్టీకి ఆంటీ ముట్టనట్టుగా ఉన్నారు. కోస్తాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు యాక్టివ్ కావడం లేదు. దీంతో అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వం అన్ని బాధ్యతలు చూస్తోంది.
రెడ్డి సామాజిక వర్గంలో మార్పు..
రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. 2019లో రెడ్డి సామాజిక వర్గం బాగానే పనిచేసింది. అయితే అలా పని చేసిన సొంత సామాజిక వర్గానికి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా అడుగడుగునా అవమానాలు, ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయారు రెడ్డి సామాజిక వర్గం నేతలు. అయితే ఏడాది కాలంలో వారిలో మార్పు కనిపిస్తోంది. కానీ బాహటంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు మాత్రం వారు ఇష్టపడడం లేదు. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుంజుకున్నట్లు కనిపించడం లేదు. అందుకే రెడ్డి సామాజిక వర్గం సాహసించి ముందుకు రావడం లేదు. ఇలా ఎలా చూసిన 2025 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం మోదం.. అంతకుమించి ఖేదం అన్నట్టు ఉంది.