2025 Roundup: ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. 2024 జూన్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. తొలి ఆరు నెలలు పాలనను గాడిలో పెట్టేందుకు సమయం కేటాయించారు. అయితే 2025 ఏడాది మొత్తం పాలన సజావుగా ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పై అనేకరకాల ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ పెద్దగా ఉన్న చంద్రబాబు పనితీరుపై మంచి మార్కులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోవడంతో చంద్రబాబు గ్రాఫ్ పెరిగింది. ఒక్క సంక్షేమ పథకాలు కాదు అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖకు పెట్టుబడులు వంటి కారణాలతో చంద్రబాబు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఏడాది కాలంలో.
వరుసగా సంక్షేమ పథకాలు..
2024 జూన్ లో అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. చంద్రబాబు పథకాలు అమలు చేయలేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి కీలక పథకాలను అమలు చేశారు చంద్రబాబు. హామీ ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూడా అమలు చేసి చూపించారు. తద్వారా సంక్షేమంలో శభాష్ అనిపించుకున్నారు.
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఇది రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు తో పాటు నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లారు. వరుసగా దావోస్, సింగపూర్, లండన్ వంటి దేశాలకు వెళ్తూ అక్కడ పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించారు. దాని ఫలితమే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు. దాదాపు 14 లక్షల కోట్ల పెట్టుబడులు. వీటిలో సగం గ్రౌండ్ చేసిన ప్రభుత్వానికి పెద్ద విజయం. అయితే ఈ పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ముందున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గ్రాఫ్ పెరిగినట్టు కనిపించింది.
అమరావతి నిర్మాణంతో..
అమరావతి రాజధాని నిర్మాణంతో చంద్రబాబు మరోసారి జాతీయస్థాయిలో గుర్తించబడ్డారు. ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించారు. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రుణాలు రావడంతో అమరావతి నిర్మాణ పనులు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని.. రాష్ట్రంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ.. అభివృద్ధిని యధాతధంగా ముందుకు తీసుకెళ్తూ.. చంద్రబాబు చేసిన ఈ ప్రయత్నంతో జాతీయస్థాయిలో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది ఈ ఏడాదిలో. ఒక విధంగా చెప్పాలంటే 2025 చంద్రబాబుకు కలిసొచ్చిన సమయం గానే భావించవచ్చు.