Nara family achievement: మరి కొన్ని గంటల్లో 2025 కనుమరుగు కానుంది. కాలగర్భంలో కలిసిపోనుంది. అయితే గడిచిన ఏడాది కాలంలో అనేక మధురస్మృతులు ఉంటాయి. కొందరు విషాదాలతో పాటు వివాదాలను ఎదుర్కొంటారు. మరికొందరు మధురానుభూతులను సొంతం చేసుకుంటారు. మంచి, చెడుల సమాహారమే కాలం. అయితే సీఎం చంద్రబాబు ఫ్యామిలి కి మాత్రం ఈ ఏడాది ఒక అద్భుతం అని చెప్పాలి. ఆ కుటుంబంలో ఉన్నది ఐదుగురు. ఆ ఐదుగురికి ఈ ఏడాది ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే నారా ఫ్యామిలీకి 2025 స్పెషల్. పాలనలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ బిజీ అయ్యారు. సేవా కార్యక్రమాలతో నారా భువనేశ్వరి, వ్యాపార రంగంలో నారా బ్రాహ్మణి, క్రీడల్లో నారా దేవాన్ష్ ఈ ఏడాది ప్రత్యేకంగా గుర్తింపు సాధించుకున్నారు. అందుకే నారా కుటుంబానికి ఇది స్పెషల్ గానే చెప్పవచ్చు.
ఏపీకి భారీగా పెట్టుబడులు..
2024లో టిడిపి కూటమి చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2025లో చంద్రబాబు తన పాలనా దక్షతను నిరూపించుకున్నారు మంత్రి లోకేష్ సైతం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి మూడు రోజుల్లోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు తండ్రీ కొడుకులు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి ఆలోచనలు చంద్రబాబువే. గత 12 నెలల కాలంలో చంద్రబాబు అలుపెరగని పోరాటం చేశారు. అందుకే ఈ ఏడాది ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు చంద్రబాబుకు లభించింది. ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబుకు ఎంపిక చేసి పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన ఏ నేతకు కూడా ఇటువంటి అవార్డు రాలేదు. పాలనలో తెచ్చిన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు గాను ఈ అవార్డు దక్కింది.
నారా భువనేశ్వరికి ఏడాది రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న భువనేశ్వరి ఐఓడి డిస్టింగ్విష్డ ఫెలోషిప్ అవార్డుతో పాటు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబర్లో లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రెండు అవార్డులను స్వీకరించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ గుర్తింపు లభించింది.
* నారా బ్రాహ్మణి సైతం ఓ అవార్డును దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో చూపుతున్న నాయకత్వ లక్షణాలకు గాను బిజినెస్ టుడే బీటి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ పేరిట అవార్డును ప్రకటించింది. ఇలా ఒకే ఏడాది అత్తా కోడళ్ళు పురస్కారాలు దక్కించుకోవడం నిజంగా విశేషమే.
* మరోవైపు చంద్రబాబు మనవడు, లోకేష్ తనయుడు దేవాన్సు సైతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిమిషం 43 సెకండ్లలో 175 చెస్ చెక్ మేట్ పజిల్స్ ను పరిష్కరించారు. ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒక్క ఏడాదిలో మూడు తరాలకు చెందిన వారు నారా ఫ్యామిలీలో ఈ అరుదైన గుర్తింపు సాధించడం విశేషం.