Homeఆంధ్రప్రదేశ్‌Education System: 1998 డీఎస్సీ.. ఇప్పుడు టీచర్ ఉద్యోగం.. ఇదీ మన విద్యావ్యవస్థ తీరు

Education System: 1998 డీఎస్సీ.. ఇప్పుడు టీచర్ ఉద్యోగం.. ఇదీ మన విద్యావ్యవస్థ తీరు

Education System: తానో ఉద్యోగ అభ్యర్థినని మరిచిపోయాడు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో మానసిక వ్యధకు గురయ్యాడు. సాటి మనుషులతో సంబంధాలు కోల్పోయి ఒంటరి జీవితానికి అలవాటుపడ్డాడు.తల్లిదండ్రులు మరణించగా.. ఉన్న తోబుట్టువులు ఈయన మానసిక స్థితి చూసి దూరమయ్యారు. భిక్షాటన చేస్తూ బతుకుతున్న ఆయన జీవితంలో చిన్న వెలుగు వచ్చింది. ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ మూడు రోజుల తరువాత గ్రామానికి చెందిన యువకులు చెబితే కానీ ఆ విషయం తెలియదు. వింతగా ఉంది కదూ ఈ మాట. కానీ ఇది నిజం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుది ఈ దయనీయ గాథ. కేదారేశ్వరరావు చేనేత కార్మిక కుటుంబంలో పుట్టాడు. ప్రాథమిక స్థాయి నుంచి చదువు అంటే మక్కువ. బీఈడీ పూర్తిచేసిన ఆయన 1994లో డీఎస్సీ రాశాడు. కానీ తక్కువ మార్కులతో ఉద్యోగం కోల్పోయాడు. 1996 డీఎస్సీలో ప్రయత్నించినా సెలక్ట్ కాలేదు. 1998 డీఎస్సీలో మాత్రం క్వాలిఫై అయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫలితాలు కోర్టు చిక్కుల్లో పడిపోయాయి. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదవు, వాగ్దాటి, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా.. ఆయన మాత్రం నిరాశలోకి వెళ్లిపోయారు. అంతేకాదు అప్పటివరకు హాయిగా ఉన్న జీవితం ఒక్కసారి తలక్రిందులైంది. నిర్వేదంలో తన గురించి తానే పట్టించుకోవడం మానేశాడు. సరైన తిండిలేక ముఖంలో జీవం పోయింది. సరే జరిగిందేదో జరిగిపోయిందని.. అన్నీ వదిలేసి కులవ్రత్తి వైపు అడుగులు వేశాడు. సైకిల్ పై బట్టల వ్యాపారం చేద్దామనుకుంటే.. ఆయన రూపం చూసి ఎవరూ కొనేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. ఇంతలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో తినడానికి తిండిలేక కాలే కడుపు నింపుకోవడానికి యాచించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన ఇంతటి విద్యావంతుడా అంటే ఎవరూ నమ్మేవారు కూడా కాదు, గ్రామంలో బాగా తెలిసిన వాళ్లకే కేదరాశ్వేరరావు గురించి తెలుసు.

Education System
Kedareswarao

సీన్ కట్ చేస్తే ఆదివారం గ్రామ సమీపంలో వంట చెరకు సేకరించి సైకిల్ పై వస్తున్న కేదారేశ్వరరావును కొంతమంది యువకులు పలకరించారు. మాస్టారు అంటూ సంబోధించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ హఠాత్ పరిణామంతో అవాక్కయిన కేదారేశ్వరరావు కొత్తగా అలా పిలుస్తున్నారెందుకు? అంటూ ప్రశ్నించగా.. మీకు ఉద్యోగం వచ్చిందంటూ వారు బదులిచ్చారు. నాకు అటువంటి సమాచారమేదీ లేదు. నా దగ్గర కనీసం ఫోన్ కూడా లేదని బదులివ్వగా యువకులు చలించిపోయారు. మూడు రోజుల కిందట వెబ్ సైట్లో అధికారులు పెట్టిన డీఎస్సీ అభ్యర్థుల జాబితాను చూపించడంతో కేదారేశ్వరరావుకు నమ్మకం కుదిరింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని.. వెళ్లి ఉద్యోగంలో చేరుతానంటూ అమాయకంగా చెబుతున్నారు కేదారేశ్వరారవు. నిజానికి ఆయన ముఖంలో ఇప్పటికైనా న్యాయం జరిగిందనే సంతోషం కూడా కనిపించని పరిస్థితి. ఎందుకంటే డీఎస్సీ వివాదం వల్ల ఆయన జీవితాన్ని కోల్పోయాడు. ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికాలేదు. ఒంటరిగా మిగిలిపోయాడు.

Also Read: Daughters Of Heroes: సినిమాల్లో కొడుకులే కాదు కూతుళ్లకు అవకాశాలే?

ఇది ఒక కేదారేశ్వరరావు పరిస్థితే కాదు. 1998 డీఎస్సీలో క్వాలిఫై అయిన వారిలో చాలామంది ఇదే వ్యథను అనుభవిస్తున్నారు. ఉద్యోగంపై ఆశలు వదులుకొని చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోయారు. కొందరు ఎదురుచూసి తమ విలువైన సమయాన్ని వ్రుథా చేసుకున్నారు.

జరగాల్సిన న్యాయం సమయానికి జరగకపోయినా అన్యాయం జరిగినదానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. జీవితాలు నాశనమయ్యాక కష్టానికి తగ్గిన ఫలితం వచ్చినా అది శూన్యమే. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించి.. ఎవేవో కారణాల వల్ల ఆలస్యమయితే వారి జీవితం అంథకారంలో పడ్డట్లే. ఆ ఉద్యోగం కోసం ఎదురు చూడలేరు.. మరో ఉద్యోగానికి వెళ్లనూ లేరు. ఈ విషయంలో విద్యా వ్యవస్థ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల కిందట ఉద్యోగానికి పరీక్ష రాయడమేమిటి? ఫలితాలు ఇప్పుడు ఇవ్వడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయపరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకుండా.ఇష్టారాజ్యంగా నోటిఫికేషన్ వెలువరించడంతో చిక్కులు ఎదురయ్యాయని నిపుణులు చెబుతున్నారు. 1998 డీఎస్సీ అయిన తరువాత ఐదు ప్రభుత్వాలు అధికారం చేపట్టాయి. కానీ పరిష్కార మార్గం చూపలేకపోయాయి.ఎట్టకేలకు ఉద్యోగాలిస్తున్నా వారు కోల్పోయిన జీవితం మాత్రం వెనక్కి తీసుకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం కేదారేశ్వరరావు వయసు 55 ఏళ్లు. దాదాపు అభ్యర్థులందరిదీ ఇదే వయసు ఉంటుంది. అంటే గట్టిగా పదేళ్లు కూడా ఉద్యోగం చేయకుండానే రిటైర్ అవ్వాల్సిన న పరిస్థితి.

Also Read: Shriya Saran: ఏకంగా న్యూడ్ ఫోటో షేర్ చేసిన శ్రీయా… విరుచుకుపడుతున్న నెటిజెన్స్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular