చంద్రబాబుకు ( AP CM Chandrababu)రాజకీయ చాణుక్యుడు అన్న పేరు ఉంది. అందుకు తగ్గట్టు ఆయన సీనియర్ నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అటు శారీరక క్రమశిక్షణతో పాటు సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా వంటి వాటితో ఏడుపదుల వయసులో కూడా చురుగ్గా ఉంటున్నారు. మరో పదేళ్లపాటు ఇలానే కొనసాగుతానని సంకేతాలు ఇస్తున్నారు. ఇక తేల్చుకోవాల్సింది ప్రజలే. చంద్రబాబు తన పాలనతో ఏపీకి మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఆయన వయసు దృష్ట్యా.. ఎన్నెన్నో మాటలు వినిపిస్తున్నాయి. కానీ చంద్రబాబును పరిశీలిస్తే.. ఆయన పని గంటలను లెక్కిస్తే.. ఆయన స్టామినాను చూస్తే మరో 10 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో కొనసాగ గలరు. చురుగ్గా ఉండగలరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి ప్రారంభం అయింది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అయితే మరోసారి కూటమికి అధికారం ఇస్తేనే దాని ఫలాలు దక్కే అవకాశం ఉంది.
సానుకూలతలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan) తన వంతు సహకారం ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఇప్పుడున్న రాజకీయ మైత్రి కొనసాగుతుందని సంకేతాలు ఇస్తుంది. అదే సమయంలో గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు సైతం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో మాట్లాడుతున్నారు. చాలా రకాల మినహాయింపులు తెచ్చుకుంటున్నారు. ఏపీ కోసం డేటా పాలసీని మార్చింది కేంద్రం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం భారీగా నిధులు అందిస్తోంది. రాజకీయంగా కూడా జాతీయస్థాయిలో ఏపీకి ప్రాధాన్యం దక్కుతోంది.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం..
చంద్రబాబు వయసుకు మించి పని చేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడం లేదు. తరచు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పెట్టుబడుదారులను కలుస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేస్తున్నారు. విధిగా ప్రతినెల ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూనే ఉన్నారు. ఏపీకి ఎటువంటి విపత్తులు వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా.. యువకుడి మాదిరిగా పనిచేసి చూపిస్తున్నారు. దాదాపు 17 నెలల పాలన పూర్తి చేసుకున్నారు. అంటే తొలి రెండేళ్లు దాదాపు సమీపించినట్టే. కానీ ప్రజల నుంచి మాత్రం సంతృప్తి శాతం అధికంగా కనిపిస్తోంది. మధ్య మధ్యలో పాలనా వైఫల్యాలు, రాజకీయ పరిణామాలు తలెత్తినా చంద్రబాబు చూపుతున్న చొరవతో అవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి. అద్భుతమైన పాలన అనలేం కానీ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండడం, పారిశ్రామిక పెట్టుబడులు కనిపిస్తుండడం కూడా వారి పనితీరు బయటపడుతుంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే 2029 లోను కూటమికి సానుకూలం అని తెలిసిపోతోంది.