https://oktelugu.com/

Macharla Municipality: పిన్నెల్లికి బిగ్ షాక్.. మాచర్ల మున్సిపాలిటీని ఎగిరేసుకుపోయిన టిడిపి

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. ఈవీఎంల ధ్వంసం కేసులో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. మాచర్ల మున్సిపాలిటీ టిడిపి ఎగురేసుకుపోయింది.

Written By:
  • Dharma
  • , Updated On : August 24, 2024 / 10:45 AM IST

    Macharla Municipality

    Follow us on

    Macharla municipality : మాచర్లలో వైసీపీకి షాక్ తగిలింది. అక్కడ రాజకీయం మరో మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్లే మున్సిపాలిటీ పై టిడిపి జెండా ఎగిరింది. శుక్రవారం మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. 16 మంది వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లకు గాను.. 16 మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరడంతో.. ఆ పార్టీకి బలం చేకూరింది. ఎమ్మెల్యే ఓటుతో కలిపి ఆ బలం 17 కు చేరింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం సరిపోవడంతో టిడిపి తరఫున చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో పడింది. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ముందుగా చైర్మన్ గా తురక కిషోర్, అనంతరం బోయ రఘురామిరెడ్డి, ఏసోబు చైర్మన్ గా పనిచేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో వ్యక్తి చైర్మన్ గా తెరపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ గా ఎన్నికయ్యారు.

    * వైసిపికి పెట్టని కోట
    మాచర్ల అంటే వైసీపీకి అడ్డాగా మారిపోయింది. గతంలో ఇదే మాచర్లలో టిడిపి నేతలపై దాడి జరిగింది. బోండా ఉమా, బుద్దా వెంకన్న కారులో వెళుతుండగా తురకా కిషోర్ పెద్ద కర్రతో దాడి చేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల కేంద్రంగా చేసుకొని నడిపిన రాజకీయం చాలా సంచలనాలకు వేదికగా మారింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లికి నిన్ననే బెయిల్ లభించింది. కానీ మాచర్ల మాత్రం టిడిపి ఖాతాలో చేరింది.

    * మారిన సీన్
    మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయారు. జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీలో సీన్ మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మునిసిపల్ చైర్మన్ ఏసోబు అనారోగ్య సమస్యలతో సెలవు పెట్టారు. దీంతో రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు పోలూరి నరసింహారావు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. 16 మంది కౌన్సిలర్లతో సహా టిడిపిలో చేరారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఉండడంతో.. మాచర్లలో లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపాలిటీ టిడిపి ఖాతాలో చేరింది.

    * ఆ కౌన్సిలర్ల చూపు టిడిపి వైపు
    ప్రస్తుతానికి నరసింహారావు యాక్టింగ్ చైర్మన్ గా ఉన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయి చైర్మన్ గా ఎన్నుకోనున్నారు. మరోవైపు వరుస సమావేశాలకు కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మూడోసారి హాజరు కాకుంటే మాత్రం వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన 15 మంది కౌన్సిలర్లు సైతం టిడిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది.