AP Government Jobs: ఏపీ ప్రభుత్వం( AP government) పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా పోలీస్ శాఖలో పదవీ విరమణలతో వివిధ విభాగాలు ఖాళీలు ఏర్పడ్డాయి. కొంతవరకు పదోన్నతులతో సర్దుబాటు చేసిన చాలా వరకు పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. దాదాపు 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఆరువారాల్లో వీటి భర్తీకి సంబంధించి కీలక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దానిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
20వేల పోస్టులు ఖాళీ..
పోలీస్ శాఖలో( police department) కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు దాదాపు 20 వేల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించింది. ముఖ్యంగా కానిస్టేబుల్ నియామకం వరుసగా చేపడతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని జోలికి పోలేదు. 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి చేతులు దులుపుకుంది. రకరకాల సమస్యలు చెప్పి దాటవేత ధోరణితో ముందుకు సాగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కానిస్టేబుల్ నియామకాల కు సంబంధించి చట్టపరమైన అంశాలను అధిగమించింది. తుది ఎంపిక పరీక్షలు నిర్వహించి.. తుది ఫలితాలను వెల్లడించింది. కొద్దిరోజుల్లో కానిస్టేబుళ్లు గా ఎంపికైన వారు శిక్షణకు వెళ్ళనున్నారు. అయితే ఇంతలోనే కోర్టు ఆదేశాలు ఇవ్వడం.. ఆరువారాలపాటు గడువు విధించడం.. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
నూతన నియామకాలు తక్కువ..
సాధారణంగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఎందుకంటే ప్రతి నెల అధికారులతో పాటు సిబ్బంది పదవీ విరమణ చేస్తారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు. అందుకే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. వాటిని భర్తీ చేయడం ముఖ్యం. అయితే దాదాపు పోలీస్ శాఖలో 20వేల పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నాయి. అయితే మరో నాలుగు వేలపాటు ఈ భర్తీ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు నేరుగా కోర్టు ఆదేశించడంతో ఎలా ముందుకు వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది.