10th Class Paper Leaked: ఏపీలో విద్యాశాఖ పనితీరు మరోసారి చర్చకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా విద్యాశాఖ పనితీరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో గాడిలో పెడతారని అంతా భావించారు. కానీ అదే పరిస్థితి కొనసాగుతోంది. పదో తరగతి పరీక్షలకు సంబంధించి 100 రోజుల ప్రణాళిక అమలవుతోంది. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అటు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందే ప్రశ్న పత్రాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం సంచలనం రేకెత్తించింది. దీనిపై అప్రమత్తమైన విద్యాశాఖ అన్ని తరగతులకు సంబంధించి పరీక్షలను రద్దు చేసింది. సీల్డ్ కవర్లో ఎంతో పగడ్బందీ రక్షణలో ఉంచాల్సిన ప్రశ్న పత్రాలు రెండు రోజుల క్రితమే యూట్యూబ్లో అప్లోడ్ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడ లీక్ చేశారు అన్నది ఇప్పటికీ అధికారులు గుర్తించలేకపోతున్నారు. విద్యాశాఖకు ఇదొక మాయని మచ్చ కూడా.
* పబ్లిక్ పరీక్షల నిర్వహణపై నీలి నీడలు
మార్చిలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఒక సాధారణ హాఫ్ ఇయర్లీ పరీక్షల ప్రశ్నా పత్రాలను లీక్ చేశారంటే.. పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాల విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్ర వ్యక్తం అవుతోంది. సాధారణ పరీక్షలు నిర్వహించలేని వారు.. పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం అమానుషమని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* పరీక్ష ప్రారంభమైన గంటలోనే..
అర్థ సంవత్సరం పరీక్షలకు సంబంధించి సోమవారం మ్యాథ్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష ప్రారంభమైన గంటలోనే మ్యాథ్స్ పేపర్ యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం వ్యాపించింది. విషయం తెలియగానే పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ప్రారంభమైన అన్ని పరీక్షలను నిలిపివేయాలని ఆర్ జేడీలు, డీఈఓ లకు వాట్సాప్ సందేశాలు పంపించారు. మ్యాథ్స్ పరీక్షను ఈనెల 20 నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యా శాఖను నారా లోకేష్ చూస్తున్నారు. ఈ తరుణంలో విపక్షాలకు ఇదో ప్రచార అస్త్రంగా మారింది. మరోవైపు ఈ ప్రశ్న పత్రాలు ఎక్కడ లీక్ అయ్యాయి అన్నది ఇప్పటికీ గుర్తించలేకపోవడం విశేషం. దీనిపై ఆ శాఖ అధికారులు సైతం నోరు మెదపడం లేదు.