APSRTC: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాధాన్యత క్రమంలో ఒక్కో హామీని నెరవేర్చుతూ ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేసింది.పింఛన్ బకాయిలను సైతం అందించింది.గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల విషయంలో బడ్జెట్లో కేటాయింపులు చేసింది. అయితే మహిళల పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు కసరత్తు పూర్తయింది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
* ఆ రెండు రాష్ట్రాల్లో
ఎన్నికల కు ముందు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పై కూటమి హామీ ఇచ్చింది. అంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత ప్రయాణం పై హామీ ఇచ్చింది. పథకాన్ని అమలు చేయగలిగింది. అటు తరువాత తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ ఇదే హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచి అమలు చేస్తోంది. అయితే ఏపీలో సైతం కూటమి ఇదే హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అమలు చేయలేక పోయింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో.. వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
* మరిన్ని బస్సులు
అయితే ఏ ప్రాతిపదికన ఈ పథకాన్ని అమలు చేయాలన్న దానిపై ప్రభుత్వం రకరకాలుగా ఆలోచన చేస్తోంది. ఈ పథకం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న బస్సులు కూడా చాలవు. అందుకే అదనంగా వెయ్యి బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు అద్దె బస్సులను సైతం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. మరో నెల రోజుల్లో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. దీంతో సంక్రాంతి నాటికి ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు కానుందన్నమాట.