Anna Canteens : పేదవాడికి పట్టెడు అన్నం కోసం కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించింది.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు,నగరాల్లో 100 క్యాంటీన్లను ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల చివరకు మరికొన్ని క్యాంటీన్లను తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు గుడివాడలో క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం దక్కిన రోజున పురస్కరించుకొని.. పేదవాడి పొట్టకు కూడా స్వతంత్రం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.సంబరాల మధ్య అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అందుకే టిడిపి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.అయితే ఏదో క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని కాకుండా.. పేదవారికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏయే పదార్థాలను అందించాలో కూడా స్పష్టం చేసింది. వారానికి ఒక వెరైటీ చొప్పున మెనూ రెడీ చేసింది. అన్నం ఎంత వడ్డించాలి?కూర,సాంబారు,పప్పు,పచ్చడి ఎంత మోతాదులో వెయ్యాలి అన్నది కూడా స్పష్టం చేసింది. కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం,రాత్రికి ఐదు రూపాయలకే భోజనం ఈ క్యాంటీన్ ల ద్వారా అందించనున్నారు. తద్వారా ఒక పేదవాడు 15 రూపాయలతో కడుపు నింపుకుంటాడు అన్నది ప్రభుత్వ ఆలోచన.అయితే ఇందుకు సంబంధించి మెనూ కూడా ఖరారు చేశారు. ఈ ఆహారం అందించే బాధ్యతలను అక్షయపాత్ర సంస్థ చూస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పేదవారికి ఆహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. టిఫిన్ కు సంబంధించి ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి 12:30 నుంచి 3:00 వరకు, రాత్రి భోజనానికి సంబంధించి 7:30 నుంచి 9 గంటల వరకు అందిస్తారు. ఆదివారం మాత్రం సెలవు దినం.
*:మెనూ ఇలా..
సోమవారం : టిఫిన్లు ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి, లేదా సాంబార్ అందిస్తారు. ఇడ్లీ వద్దనుకుంటే పూరీ, కుర్మా ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లోనూ మెనూ మారుతుంది.
మంగళవారం : ఇడ్లీ చట్నీ,పొడి లేదా సాంబార్ కామన్. ఇది వద్దనుకుంటే ఉప్మా తో చట్నీ, మిక్చర్ వడ్డిస్తారు. మధ్యాహ్నం, రాత్రి యధావిధిగా భోజనాలు ఉంటాయి.
బుధవారం: ఇడ్లీ కామన్ గా ఉంటుంది. ప్రత్యేకంగా పొంగల్తో చట్నీ లేదా సాంబార్ వడ్డిస్తారు. మధ్యాహ్నం భోజనంలో బిరియాని పెడతారు. రాత్రికి మెనూ కామన్.
గురువారం : ఉదయం ఇడ్లీ కామన్. ప్రత్యేకంగా పూరి కుర్మా ఉంటాయి. మధ్యాహ్నం చిత్రాన్నం లేదా సాధారణ మీల్స్. రాత్రికి మామూలు భోజనం.
శుక్రవారం : ఇడ్లీ కామన్ గా ఉంటుంది. ప్రత్యేకంగా కోరుకుంటే పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కామన్.
* పదార్థాలు ఎంతెంత అంటే
ఉదయం టిఫిన్ లో.. ఇడ్లీ, పూరీల్లో ఏది కోరుకుంటే అది ఒక్కొక్కరికి మూడు చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగల్ అయితే పావు కిలో వడ్డిస్తారు.
మధ్యాహ్నం: అన్నం 400 గ్రాములు,చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు.. అదే మోతాదులో రాత్రి భోజనం కూడా ఉంటుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More