Sakshi Media: మీడియాలో కూడా విభజన రేఖ కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా మారుతోంది. పార్టీకి ఒక ఛానల్, ఒక పత్రిక అన్నట్టు పరిస్థితి మారింది. అందుకే మీడియాపై కూడా.. ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అంటూ ముద్రలు వేస్తున్నారు. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా మారిపోయింది సాక్షి. మిగతా రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియాలు ఉన్నా.. సాక్షి మీడియా మాత్రం అడ్డగోలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రమే. అయితే ఆ మీడియా వైసీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకుల నుంచి.. తరచూ ఆ మీడియా డిబేట్ లలో పాల్గొనే విశ్లేషకుల నోటి నుంచి. నిత్యం సాక్షిలో కనిపించే కేఎస్ ప్రసాద్, పాషాలు సాక్షిని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. సాక్షి మీడియాతో వైసిపికి నష్టం అని వాదిస్తున్నారు.
* రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత..
రాజశేఖర్ రెడ్డి (Y S Rajasekhara Reddy ) ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షి మీడియా తెరపైకి వచ్చింది. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో సాక్షి పత్రికను పెట్టించారు. ఆపై సాక్షి టీవీ ఛానల్ కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పటివరకు ఈనాడు, ఆంధ్రజ్యోతి హవా నడిచేది. వాటికి చెక్ పెట్టి.. ఈనాడు కుమించి చూపించాలన్న ప్రయత్నంలో.. చాలా రకాల ప్రయోగాలు చేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికను రూపాయికి విక్రయించేవారు. అయితే తాను ఒక్కడినే కాదు మిగతా పత్రికలు కూడా ధరలను తగ్గించాలని కోరేవారు. అయితే వైసిపి ఆవిర్భావం తర్వాత సాక్షి పత్రిక, మీడియా స్వరూపమే మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి ఫోటోను ప్రచురించి వేసుకునేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్క్యులేషన్ పెంచేందుకుగాను ఉచితంగా అందించేవారు. ఇలా రకరకాల ప్రయోగాలతో ప్రత్యర్థి పత్రికలతో పాటు టీవీ ఛానళ్లను దెబ్బతీయాలని చూసారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు.
* విశ్లేషకులు గా ఆ ఇద్దరు..
సాక్షి మీడియా( Sakshi media) అనేసరికి దిగ్గజ జర్నలిస్టులు కనిపించే వారు కాదు. ముఖ్యంగా టీవీ ఛానల్ డిబేట్లకు కొంతమంది ఎంపిక చేసిన వారే వచ్చేవారు. అందులో కేఎస్ ప్రసాద్ ఒకరు. మరొకరు పాషా. మంచి వాగ్దాటితో ఇద్దరు విశ్లేషకులుగా చలామణి అయ్యారు సాక్షి టీవీ ద్వారా. కానీ ఇటీవల వారిని తప్పించి.. కొత్తగా కొంతమంది విశ్లేషకులను ఛానల్ కు రప్పించి డిబేట్లో మాట్లాడిస్తున్నారు. కేఎస్ ప్రసాద్ తో పాటు పాషాను పక్కన పెట్టినట్లు మీడియా వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఇద్దరూ ఇప్పుడు సాక్షితో పాటు వైసీపీకి వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. సాక్షితో వైసిపికి నష్టమే కానీ ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చి చెబుతున్నారు. వారికి చెల్లింపుల విషయంలో తేడా రావడం.. గతం మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతోనే ఆ ఇద్దరూ ఇప్పుడు ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది.