Ajit Agarkar: ఎంతటి ఉక్కు శరీరమైనా సరే.. విశ్రాంతి కావాలి. విశ్రాంతి ఇవ్వకుండా ఉక్కు శరీరం కదా అని ఇష్టానుసారంగా పని చేయిస్తే.. అదేపనిగా భారం మోపితే శరీరం పనిచేయదు.. పైగా అనారోగ్యానికి గురై నరకం చూపిస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీమిండియా వన్డే, టెస్ట్ ఫార్మాట్ సారధి గిల్ ఎదుర్కొంటున్నాడు.
గిల్ టెస్టులు, వన్డేలలో టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 25 సంవత్సరాలు. సౌత్ ఆఫ్రికా జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అతడు గాయపడ్డాడు. కోల్ కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో అతడు మెడ కండరాల గాయంతో బాధపడ్డాడు. అంతేకాదు అకస్మాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.. వైద్యులు చెబుతున్న సమాచారం ప్రకారం అతడు రెండవ టెస్టు ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది.
కొంతకాలం గా గిల్ నిర్విరామమైన క్రికెట్ ఆడుతున్నాడు.. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు అందుకున్న అతడు.. వరుసగా సిరీస్ లు ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత నెల విశ్రాంతి దొరికింది. ఆ తర్వాత ఆసియా కప్ ఆడాడు గిల్.. అనంతరం వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడాడు. అనంతరం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు వన్డేలకు సారధిగా వ్యవహరించాడు. ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ కు ఉపసారధిగా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోజుల వ్యవధిలోనే స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
వాస్తవానికి ఎంతటి క్రికెటర్ అయినప్పటికీ.. అతడి శరీరానికి విశ్రాంతి అవసరం.. విశ్రాంతి లభించకపోవడంతో గిల్ మెడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. గిల్ విషయంలో మేనేజ్మెంట్ ప్రయోగాలు చేస్తోంది.. టెస్ట్, వన్డే ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా క్రికెట్ ఆడిస్తోంది.. దీంతో అతని శరీరం అలసిపోతోంది. వాస్తవానికి ప్రాంతాలకు తగ్గట్టుగా వాతావరణ ఉంటుంది. ఆ వాతావరణానికి శరీరం అలవాటు పడకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రస్తుతం గిల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఇటీవల అజిత్ అగర్కార్ గిల్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి వయసు పాతిక సంవత్సరాలు కాబట్టి.. క్రికెట్ ఆడనివ్వండి అంటూ వ్యాఖ్యానించాడు.. మరోవైపు మరో కోచ్ మోర్కల్ కూడా గిల్ విషయంలో ఇలానే మాట్లాడాడు. ఆ గాయం అంత తీవ్రమైనది కాదని.. త్వరలోనే కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. వాస్తవానికి మేనేజ్మెంట్ ధోరణి ఇలానే ఉంటాయి.. భవిష్యత్తు కాలంలో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడుతాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఏరి కోరి గిల్ ను సారధిగా చేసిన గౌతమ్ గంభీర్.. అతని మీద విపరీతమైన ఇష్టాన్ని చూపించిన మేనేజ్మెంట్.. గేమ్స్ ఆడుతున్నాయని.. గిల్ కెరియర్ తో ఆటలాడుతున్నాయని అతని అభిమానులు పేర్కొంటున్నారు.