KCR vs Governor : వివాదం సమసిపోయింది. అన్నాచెల్లెళ్లు కలిసిపోయారు. అనుకుంటున్న తరుణంలో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. ఇరు వ్యవస్థల మధ్య కొద్ది రోజులుగా అటు ప్రగతి భవన్, ఇటు రాజ్ భవన్ మధ్య మంటలు మండుతున్నాయి. ఇటీవల బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇవ్వని గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సూచనతో బయటే సర్దుబాటు చేసుకోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడానికి ప్రభుత్వం ఒకే చెప్పింది. గవర్నర్ కూడా సమావేశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దాంతో, ఇరు వ్యవస్థల మధ్య పంచాయితీ సమసిపోయిందని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ, ఆ తర్వాత కూడా బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీనికితోడు, ప్రొటోకాల్ వివాదం కూడా కొనసాగుతోంది. ఇటీవల నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పాల్గొనడానికి గవర్నర్ వెళితే, అక్కడి కలెక్టర్, సీపీ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
పరస్పర ఆరోపణలు
తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. గత సెప్టెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి, అదే నెల 13న గవర్నర్ తమిళిసైకి పంపించింది. వాటిలో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. మిగతా వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిల్లో ముఖ్యంగా ఆజామాబాద్ పారిశ్రామికవాడలోని లీజుదారులకు హక్కులు కల్పించే బిల్లు.. ఇది గవర్నర్ అమోదానికి నోచుకుంటే. ప్రభుత్వానికి దాదాపు రూ.2000 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ బిల్లును ఆమోదించడానికి గవర్నర్ విముఖంగా ఉన్నారని, అందుకే, దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్లు తెలుస్తోంది.
గవర్నర్ పాత్ర లేకుండా చేసేందుకు
యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ కోసం కామన్ బోర్డును ఏర్పాటుపై రూపొందించిన బిల్లును కూడా ఆమోదించకపోవడంతో 1062 ప్రొఫెసర్ పోస్టులను భర్తీకి నోచుకోవడం లేదు. అయితే, ఈ బిల్లు ద్వారా గవర్నర్ పాత్ర లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. కామన్ బోర్డు ఏర్పాటుతో గవర్నర్‌కు ఎటువంటి అజమాయిషీ ఉండదని రాజ్‌భవన్ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ బిల్లుపై వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ ఆదేశించడంతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు కూడా. అలాగే, వైద్య విద్యా సంచాలకుడు, అదనపు సంచాలకుల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సవరణ బిల్లుపైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ ఇచ్చి వచ్చారు. అయినా.. వాటిని గవర్నర్ ఆమోదించలేదు. హరితహారం లక్ష్య సాధనకు అడవుల పెంపకానికి సంబంధించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సి ఉందని, అందుకే అటవీ వర్సిటీని ఏర్పాటు చేస్తూ బిల్లును పంపామని, దానిని కూడా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని తప్పుబడుతున్నాయి.
అవిశ్వాస తీర్మానం బిల్లూ పెండింగ్
మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరోధించడానికి తీసుకొచ్చిన సవరణ బిల్లును కూడా ఆమోదించడం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అలాగే, కాలానుగుణంగా వాహన పన్నులను మార్చుకునే బిల్లు, పలు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి మంజూరు చేస్తూ తెచ్చిన బిల్లు, వ్యవసాయ వర్సిటీలో అఫిలియేషన్, రికగ్నిషన్‌కు సంబంధించిన బిల్లు పెండింగ్‌లో పెట్టడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిజానికి అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఆమోదించాలి. కానీ.. వాటిని ఎప్పటిలోగా ఆమోదించాలన్న నిర్దిష్ట గడువు రాజ్యాంగంలో లేదు. ఆ అధికరణలో ‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ అన్న వాక్యం ఉండడంతో సుదీర్ఘకాలంపాటు రాజ్‌భవన్‌లో బిల్లులు పెండింగ్ పడిపోతున్నాయి. ఈ అధికరణను సవరించాలంటూ బీఆర్ఎస్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
సుప్రీం కోర్టుకు
గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్ పెండింగ్‌లో పెట్టారంటూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొంది. తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శిని చేర్చింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని పేర్కొంది. ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు, ఆలస్యం చేసే హక్కు గవర్నర్‌కు లేదని వివరించింది. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని అధికరణ 163 కింద ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహా సంప్రదింపుల మేరకే విధులను నిర్వహించాలని, శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసిందని గుర్తు చేసింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kcr vs governor controversy reached the supreme court
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com