YCP: అమ్మ ఇవ్వదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమమే తారకమంత్రంగా పనిచేసింది ఆ ప్రభుత్వం. కనీసం పరిశ్రమలను తెచ్చే ప్రయత్నం చేయలేదు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఐటీ శాఖ మంత్రి ఎవరో తెలియదు. పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించిన నేత బాధ్యతగా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రారంభంలో మేకపాటి గౌతం రెడ్డి కొంత ప్రయత్నాలు చేశారు. ఆయన అకాల మరణంతో కనీస ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తుంటే.. అడ్డగించే ప్రయత్నం చేస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఐటీ సంస్థలు వస్తుంటే గగ్గోలు పెడుతోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే భూగర్భ జలాలు ఇంకిపోతాయని, భూములు కేటాయించాల్సి వస్తోందని ఇలా లేనిపోని అంశాలను బయటకు తెచ్చి రాజకీయ ఆరోపణలు చేయిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* రాయితీలు సర్వసాధారణం..
ఏదైనా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాల రాయితీలు కల్పించాలి. పన్నుల మినహాయింపు ఇవ్వాలి. ఆపై తక్కువ ధరకే భూములు కేటాయించాలి. పరిశ్రమల పాలసీలో( industry policy) భాగంగా ఏ ప్రభుత్వం అయినా ఇలానే చేస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలానే చేసింది. కానీ పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయింది. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించి ఉత్తరాంధ్ర స్వరూపాన్ని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి నాడు ప్రకటించారు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాకపోగా.. విశాఖ నగరంలో విలువైన భూములు నాటి వైసిపి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. రుషికొండను గుండు కొట్టించి భవనాలు నిర్మించారు. కానీ ఆ భవనాలు ఎందుకు నిర్మించారో చెప్పడానికి కూడా సాహసించని పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది.
* అడ్డగించే పనిలో వైసిపి..
ఇప్పుడు పరిశ్రమలు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణంలో సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ( Alliance government ) సక్సెస్ అయ్యింది. ఏదో ఒక రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైసిపి నేతలు మారిచుల్లా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో గుడ్డు మంత్రిగా గుర్తింపు పొందిన గుడివాడ అమర్నాథ్ మాట్లాడేసరికి సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు పార్టీ ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి నేత కూడా మాట్లాడుతుండడంపై ఆక్షేపిస్తున్నారు. మీరు తేలేదు.. తెస్తే స్వాగతించడం లేదంటూ వైసీపీ నేతలపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పనిగా వైసీపీ ముందుకెళితే మాత్రం ప్రజల నుంచి ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఐటీ నిపుణులు విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ రాజకీయ కోణంలో ఆలోచించి వైసిపి భూగర్భ జలాలు అడుగంటుతాయని, అన్ని ఉద్యోగాలు రావని ప్రచారం చేస్తోంది. గుడివాడ అమర్నాథ్ అయితే గూగుల్ తో ప్రత్యేక ప్రకటన ఇప్పించాలని కోరారు. కానీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ఒక్క డేటా సెంటర్ కాకుండా.. దానికి అనుగుణంగా చాలా రకాల పరిశ్రమలు, అనుబంధ రంగాల సంస్థలు వస్తాయని చెప్పారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటికి తాళం పడడం లేదు. ఇది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. తీసుకోకపోతే మాత్రం మూల్యం తప్పదు.