Bambino Controversy: బెల్లం ఉన్నచోట చీమలు ఉన్నట్టు.. చక్కర ఉన్నచోట ఈగలు వాలినట్టు.. డబ్బున్నచోట వివాదాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా శ్రీమంతుల ఇళ్లల్లో ఆస్తులకు సంబంధించిన వివాదాలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ప్రాచుర్యం పొందిన బాంబినో కంపెనీలో ముసలం మొదలైంది. అది కాస్త ఆయన కుమార్తెలపై కేసు నమోదు చేయడానికి కారణమైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బాంబీనో కంపెనీ గురించి తెలియని వారు ఉండాలంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ కంపెనీ సేమియాలు, పాస్తా, ఇతర ఉత్పత్తులను తయారుచేస్తుంది. ఈ కంపెనీని హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మ్యాడం కిషన్ రావు ప్రారంభించారు. ఈయనకు నలుగురు కుమార్తెలు. ఆస్తులను కుమార్తెలకు పంచగా.. కొంతమేర షేర్ల ను ఆయన తన పేరు మీద ఉంచుకున్నారు. అయితే కిషన్ రావు పేరు మీద ఉన్న షేర్లను ఆయన నలుగురు కుమార్తెలు అక్రమంగా బదిలీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని కిషన్ రావు మనవడు కార్తికేయ గుర్తించి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కిషన్ రావు నలుగురు కుమార్తెలపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
వివాదం ఇదీ
కిషన్ రావు 1982లో బాంబినో పేరుతో ఒక ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు. దీనికంటే ముందు అంటే 1973లో రేవతి అనే పేరుతో టొబాకో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థల్లో కిషన్ రావు ఎక్కువ షేర్లను కలిగి ఉన్నారు. రేవతి కంపెనీలో 98.23 వాట ఆయనకు ఉంది. మిగతా వాటా ఆయన భార్య సుగంధ బాయి పై పేరు మీద ఉంది. రేవతి కంపెనీకి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఇది నంది వనపర్తి గ్రామంలో ఏకంగా 184 ఎకరాల భూమి ఉంది. దీని విలువ ఏకంగా 120 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే కిషన్ రావు అనారోగ్యంతో 2021లో కన్నుమూశారు.
కిషన్ రావు చనిపోయిన తర్వాత ఆయన కుమార్తెలు అనురాధ (ఎంకె రావు ఫౌండేషన్ ట్రస్ట్), శ్రీదేవి, ఆనంద దేవి, తుల్జా భవాని విభిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కిషన్ రావు రాసిన వీలునామకు వ్యతిరేకంగా ఆయన పేరు మీద ఉన్న షేర్లను ఒక్కొక్కరు 24.55 శాతం చొప్పున అక్రమంగా బదిలీ చేయించుకున్నారు. అంతేకాదు నంది వనపర్తి గ్రామంలో ఉన్న 184 ఎకరాల భూమి విషయంలోనూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ విషయాలను మొత్తం గుర్తించిన కార్తికేయ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిషన్ రావు స్థాపించిన బాంబీనో కంపెనీ సేమియా, మా కరోనా, పాస్తా పతులను తయారుచేస్తుంది. అనేక దేశాలకు ఎగుమతి కూడా చేస్తుంది. మసాలా దినుసులు, స్నాక్స్, ఎఫ్ ఎం సీ జీ పతులను కూడా తయారుచేసి ఏకంగా 35 దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే ఇంత గొప్ప సంస్థ పరువును కుమార్తెలు బజారు పాలు చేస్తున్నారని కార్తికేయ ఆరోపిస్తున్నారు. కిషన్ రావు కుటుంబం కూడా రాజకీయంగా ప్రముఖమైనది కావడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. పైగా ఆ నలుగురు కుమార్తెలకు రాజకీయంగా అండదండలు ఉన్న నేపథ్యంలో ఈ కేసు చర్చ నీయాంశమైంది.