Narok West: అది బిజీగా ఉన్న రోడ్డు. వాహనాల రాకపోకలు జోరుగా సాగుతున్నాయి. అటువంటి చోట చాలామంది మహిళలు ఒక్కసారిగా రోడ్డుమీదికి వచ్చారు. గట్టిగా నినాదాలు చేశారు.
తాగునీరు రాకపోతే.. రోడ్లు సరిగా లేకపోతే.. కరెంటు సరిగా ఉండకపోతే.. ఇంకా ఏమైనా సమస్యలు ఇబ్బంది పెడుతుంటే మహిళలు ఇలా రోడ్డుమీదకి వచ్చి నిరసన చేపడుతుంటారు.
ఆ మహిళలు అలా రోడ్డు మీదకి రావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అలా నిరసన తెలపడానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. అ మహిళలు చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు.
వారు అలా ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం భర్తలు. పని పాట లేకుండా వారి భర్తలు రోడ్లమీద తిరుగుతున్నారు. కనీసం ఇంట్లో పని కూడా చేయడం లేదు. దీంతో పిల్లల్ని సాకడానికి.. సంసారాన్ని వెళ్లదీయడానికి ఆ మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఆ మహిళల భర్తలు విపరీతంగా తాగుతున్నారు. తాగి రోడ్లమీద పడిపోతున్నారు. కొన్ని సందర్భాలలో ఇళ్లకు కూడా రావడం లేదు. భర్తలు అలా తాగడంతో వారి దాంపత్య జీవితం కూడా దారుణంగా ఉంది. కనీసం ఏడాదికి ఒకసారి కూడా పడక సుఖం లేకుండా పోతోందని ఆ మహిళలు ఆరోపిస్తున్నారు.
భర్తలకు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో తట్టుకోలేక ఇలా రోడ్ల మీదకి వచ్చారు. నిరసన తెలిపారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్నట్టు ఈ సంఘటన ఆఫ్రికా ఖండంలోని నరోక్ వెస్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. “మద్యపానం వల్ల చాలామంది పురుషులు తమ జీవిత భాగస్వాములతో సరిగా ఉండడం లేదు. దీంతో అక్కడి మహిళలు ఇలా నిరసన చేపట్టారు. చంగా, కుమీ వంటి మద్యం తాగుతూ అక్కడి పురుషులు వ్యసనపరులుగా మారారని” ఆఫ్రికా మీడియా తన కథనాలలో పేర్కొంది.