Former Editor : కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. వర్షం కురిసినప్పుడే.. గూడు విలువ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు. వాడేందుకు ఎర్రబుగ్గ కారు లేదు. అందువల్లే ఆయనకు ఆకస్మాత్తుగా తెలంగాణ వాదం గుర్తుకొచ్చింది. అంతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. మిత్రులారా రండి.. తెలంగాణ వాదాన్ని గుండెల నిండా నింపుకుందామంటూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ దంచారు. ఆ పోస్ట్ పెట్టడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ఆయనను అనుసరించే వారు తమ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పారు. ఎప్పటి మాదిరిగానే ఆయన తనపోస్ట్ లో ఆంధ్రామీడియా సంస్థలు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిందే ఆంధ్రా మీడియా సంస్థలలో కదా.. అలాంటప్పుడు ఆంధ్రా మీడియా సంస్థలు అని ఎలా వ్యాఖ్యానిస్తారు.. ఆయన పని చేసిన తెలంగాణ మీడియా సంస్థలో ఎంతమందికి గొప్ప జీవితాలను,జీతాలు ఇచ్చారు. కరోనా సమయంలో, అధికారం కోల్పోయిన కాలంలో తెలంగాణ సంస్థలో ఉద్యోగాలు పోతే ఎంతమంది జర్నలిస్టులకు ఆయన అండగా ఉన్నారు..ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేరు. చెప్పే దమ్ము కూడా లేదు.
ఆయన ఒకప్పుడు ఒక పత్రికకు ఎడిటర్ గా ఉండేవారు. ఆ తర్వాత ఆయనకు అనుకోకుండా నామినేటెడ్ పోస్టు లభించింది. అదేమీ చిన్నది కాదు. పైగా ఆయన మీడియాలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ప్రెస్ అకాడమీ పదవి దక్కింది. సాధారణంగా నామినేటెడ్ పోస్ట్ కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. రెండు సంవత్సరాలలో ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత.. ఉన్నట్టుండి ఆయనకు జర్నలిస్టుల సమస్యలు గుర్తుకు వచ్చాయి. వెంటనే తన యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. రూలింగ్ పార్టీకి అనుకూలమైన యూనియన్ అయినప్పటికీ.. ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఇలాంటి ధర్నాలు చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
ధర్నాలు.. నిరసనల వల్ల ఆ మాజీ ఎడిటర్ కు గట్టి లాభమే జరిగింది.. ఎందుకంటే ప్రభుత్వం ఆయన పోస్టును పునరుద్ధరించింది. నాటి ముఖ్యమంత్రి కి.. ఆయనకు మధ్యలో గ్యాప్ ఏర్పడిందని.. అందువల్లే ఆయన పోస్ట్ ఊస్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చుతూ ఓ మాజీ జర్నలిస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కాబోతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు లీకులు అందాయి. దీంతో ఆ మాజీ ఎడిటర్ వెంటనే తన యూనియన్ లో ఉన్న కొంతమందిని రంగంలోకి దింపి.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. నిరసనలు నిర్వహించారు.
వాస్తవానికి ఆ ముఖ్యమంత్రి ఈ ధర్నాలను.. నిరసనలను తన అధికారంతో తొక్కిపెట్టేవారే. కాకపోతే ఎందుకనో ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఇదే అదునుగా ఆ మాజీ ఎడిటర్ తన పదవిని కాపాడుకోవడం కోసం ప్రణాళికలు రూపొందించి అందులో విజయవంతమయ్యారు. ఆయన పదవి పునరుద్ధరణ కాగానే.. ఎప్పటి మాదిరిగానే మళ్లీ సైలెంట్ అయిపోయారు.
ఇప్పుడు ఆ పార్టీ అధికారం లేదు. ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి లేదు. ఇప్పటికిప్పుడు తనకు ఒక ప్రాపకం కావాలి.. తనకంటూ పోయిన గుర్తింపు మళ్లీ దక్కాలి. ఇదంతా జరగాలంటే ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకురావాలి. తెలంగాణ అనే వాదం తప్పితే.. ఇంకొకటి లేదు. అందువల్లే జర్నలిస్టుల జాతర.. అందరం కలుద్దాం.. గుండెల నిండా తెలంగాణ వాదాన్ని నింపుకుందాం.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు. దీని ఖర్చు మొత్తం ఎవరి భరిస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఆయనకు తెలంగాణ వాదం గుర్తుకు రావడం వెనక వింత ఏమీ లేదని.. ఆయనకంటూ వచ్చే కాలంలో పదవులు దక్కాలి కాబట్టి.. ఇప్పుడు ఈ హంగామా చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టులు పేర్కొంటున్నారు. .
సోషల్ మీడియాలో ఆ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్ట్ చేసిన తర్వాత.. చాలామంది మొహమాటం లేకుండా కామెంట్లు చేశారు. జర్నలిస్టుల సమస్యలు.. ఇతర వ్యవహారాల వరకైతే పర్వాలేదు. ఇదేది మళ్ళీ ఆయనను అధికారంలోకి తీసుకొచ్చే పనికిమాలిన కార్యక్రమం కాదు కదా అంటూ కామెంట్లు చేశారు. గతంలో ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినప్పుడు.. పోలవరం గురించి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. వాస్తవానికి ప్రెస్ అకాడమీ స్థానంలో ఉన్న వ్యక్తి జర్నలిస్టుల సమస్యలు… ఇళ్ల స్థలాల గురించి మాట్లాడాలి. అలాకాకుండా చంద్రబాబు గురించి.. పోలవరం గురించి మాట్లాడారు అంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఇప్పుడు తెలంగాణ వాదం గురించి.. తెలంగాణను గుండెలో నింపుకుందామని అంటున్నారంటే.. దాని వెనుక ఏం జరుగుతుందో.. దాని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
