Pakistan Military: పాకిస్తాన్‌లో కొన్ని రోజులుగా పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ఫ్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చాలా క్లోస్‌గా ఉన్నట్లు కనిపించారు. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాలు పాకిస్తాన్‌లో ప్రభుత్వాధికారం కేవలం పేరుకే ఉందని మరోసారి తేటతెల్లం చేస్తున్నాయి. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్నేహపూర్వక విధానాన్ని అనుసరించాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వతంత్రంగా చర్యలు చేపడుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్‌పై సైనిక చర్యలు పాక్ ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగాయన్న సమాచారం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆఫ్ఘాన్–పాక్ వైరం..
టర్కీలో ఇటీవల పాకిస్తాన్–ఆఫ్గానిస్తాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఆశాజనక వాతావరణాన్ని సృష్టించాయి. అయితే ఆ తరువాత పాక్ భూభాగం నుంచి జరిగిన డ్రోన్ దాడులు ఆ చర్చలని ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆ దాడులు అమెరికా అనుమతితో జరిగాయా లేదా పాక్ సైన్యం స్వతంత్రంగా నడిపించిందా అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఆఫ్ఘాన్ వైపు నుంచి పాకిస్తాన్‌లోని కొన్ని సైనిక వర్గాలపై నిందలు పెరుగుతున్నాయి. బయటి శక్తుల మద్దతుతో కొందరు సైనిక వర్గాలు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి అంటూ తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలమిస్తున్నాయి.
అమెరికా–పాక్ మైత్రీ..
అమెరికా, ఆష్గానిస్తాన్‌పై నిరంతర పర్యవేక్షణకు బేస్‌గా పాక్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నట్టు తేలడంతో, వాషింగ్టన్–ఇస్లామాబాద్ మధ్య రహస్య అవగాహన కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో బగ్రామ్ ఎయిర్ బేస్ పునరుద్ధరణపై చర్చలు మళ్లీ చురుకుగా సాగుతున్నాయన్నది ఆ సంకేతం. అప్పటి నుండి మునీర్‌తో ట్రంప్ ప్రభుత్వ చర్చలు జరగడం, గ్లోబల్ రాజకీయ అజెండాలో పాక్ సైన్యానికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తోంది.
ప్రజాస్వామ్యంపై ఆర్మీ నీడ
ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలు జరుగుతున్నా అసలు నిర్ణయాధికారం రావల్పిండిలోని జిహెచ్‌క్యూ చేతుల్లోనే ఉంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ కాలంలో ఆఫ్ఘాన్‌తో సంబంధాలు కొంతమేర సాఫీగా సాగాయి, కానీ ఆయనను పదవి నుంచి తొలగించిన తర్వాత సరిహద్దు శాంతి దెబ్బతింది. ప్రస్తుతం ప్రభుత్వాన్ని తక్కువ చేసి సైన్యం నియంత్రణ పెంచుకుంటున్న నేపథ్యంలో, దేశ అంతర్గత స్థిరత్వం మరింత సంకుచితమవుతోంది.
పాకిస్తాన్ అంతర్గత విభేదాలు కేవలం రాజకీయ సమస్యగా కాకుండా ప్రాంతీయ భద్రతాపరమైన ప్రమాదంగా మారుతున్నాయి. ఆఫ్ఘాన్ సరిహద్దు అశాంతి, అమెరికాతో రహస్య మైత్రీ, సైన్యం స్వార్థపూరిత అజెండా ఇవన్నీ కలిపి దేశ భవిష్యత్తుపై అనిశ్చితివైపు నెడుతున్నాయి. పాక్ ప్రజలకు ప్రజాస్వామ్యం దూరమవుతూనే, సైనిక ప్రాధాన్యత పెరుగుతోంది.