Hari Mukunda Panda: హరి ముకుంద పండా( Hari Mukunda Panda ).. ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో వినిపించిన పేరు ఇది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. 9 మంది భక్తులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు. ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. హరి ముకుంద పండ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాదాపు 12 ఎకరాల సువిశాలమైన తోటలో 10 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించారు హరి ముకుంద పండ. తిరుపతిలో స్వామివారి దర్శనం విషయంలో తనకు జరిగిన చిన్నపాటి అసౌకర్యాన్ని గుర్తించి.. పేదల కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
* ఆయనపై ప్రత్యేక గౌరవం..
అయితే ఈ పెను విషాదం జరిగింది. కానీ హరి ముకుంద పండాపై ఒక్కరంటే ఒక్కరు కూడా విమర్శలు చేయడం లేదు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. దానికి కారణం ఆయన దాతృత్వం. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలతో ఆలయం పూర్తిగా మూతపడింది. కానీ సోమవారం ఉదయం ఓ 300 మంది దివ్యాంగులు ఒకేసారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పోలీసుల ఆధీనంలో ఉంది ఆలయం. వారందరికీ లోపలికి ప్రవేశం కల్పించలేదు. దీంతో హరి ముకుంద పండ ఇంటి నుంచి బయటకు వచ్చి వారందరినీ లోపలికి వదలాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో దివ్యాంగులకు లోపలకు విడిచిపెట్టారు.
* పోలీసులకు సైతం ఆశ్చర్యం..
అయితే దివ్యాంగులు చెప్పిన మాటలకు పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వారంతా ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా( Odisha) నుంచి వచ్చిన దివ్యాంగులు. అందులో అందత్వంతో బాధపడుతున్న వారు ఉన్నారు. వైకల్యం వెంటాడిన వారు ఉన్నారు. అటువంటి వారు 200 నుంచి 300 మంది వరకు ఉంటారు. అయితే ప్రతి సోమవారం, గురువారం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. వారికి కడుపునిండా భోజనం పెట్టి.. 100% దివ్యాంగులకు 600 రూపాయలు.. పాక్షిక దివ్యాంగులకు 300 రూపాయల చొప్పున అందిస్తారు హరి ముకుందపండ. ప్రత్యేక పర్వదినాల్లో అయితే నూతన వస్త్రాలతో పాటు నిత్యవసరాలు అందిస్తారు. ఆయన మాకు దేవుడితో సమానం అంటూ దివ్యాంగులు చెబుతుండడం విశేషం. అయితే పైసా డొనేషన్ తీసుకోకుండా తమకున్న ఆస్తిని విక్రయించి దానధర్మాలు చేస్తున్నారు హరి ముకుందపండ. గత చాలా రోజులుగా ఈ దానధర్మాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలోనే అంతటి పెను విషాదం చోటుచేసుకుంది. అయితే నిన్నను కూడా హరి ముకుంద పండ వారందరినీ పిలిచి కడుపునిండా భోజనం పెట్టి.. నగదు అందించడం విశేషం.