PM Narendra Modi : బ్రిక్స్ దేశాల 16వ సమావేశం రష్యాలోని కజాన్‌లో జరుగనుంది. ఈ సదస్సుకు సభ్య దేశాలు అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ కేవలం గ్లోబల్ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం అనే అంశంతో జరుగనుంది. రష్యాలోని భారత రాయబారి, కజాన్‌లోని ఆకాశవాణి ప్రతినిధి వినయ్ కుమార్ మాట్లాడుతూ కీలకమైన ప్రపంచ సమస్యలపై చర్చించడానికి నాయకులకు ఈ శిఖరాగ్ర సమావేశం ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుందని తెలిపారు. ఇది బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని కూడా అంచనా వేస్తుందన్నారు. రష్యా అధ్యక్షుడు వలాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నట్లు శ్రీకుమార్ తెలిపారు. ప్రధానమంత్రి రష్యా పర్యటనపై న్యూ ఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, భారతదేశం బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యురాలు అన్నారు. దాని ప్రారంభం నుంచి కార్యకలాపాలు, కార్యక్రమాల్లో పాలు పంచుకుంటుందని తెలిపారు. భారతదేశం బ్రిక్స్‌కు గొప్ప విలువను తీసుకువస్తోందని, ఆర్థిక వృద్ధి, స్థిరమైన అభివృద్ధి, ప్రపంచ పాలనా సంస్కరణలు వంటి రంగాలలో బ్రిక్స్ ప్రయత్నాలను రూపొందించడంలో దాని సహకారం కీలక పాత్ర పోషించిందని శ్రీమిస్రీ వివరించారు.
గ్లోబల్ సవాళ్లపై చర్చకు కీలక వేదిక
భారత విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ గ్లోబల్ సవాళ్ల శ్రేణిని పరిష్కరించడానికి బ్రిక్స్ కీలక వేదికగా పనిచేస్తుందని తెలిపారు. బ్రిక్స్ సహకార యంత్రాంగాల్లో కొత్త బ్రిక్స్ సభ్యులను ఏకీకృతం చేయడంపై ఈ ఏడాది శిఖరాగ్ర సదస్సు దృష్టి సారించిందని తెలిపారు. రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుందని, ఇంధనం, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, యువజన మార్పిడికి సహకారాన్ని ప్రోత్సహిస్తుందని వివరించారు. గత ఏడాది జోహన్నెస్‌బర్గ్ సమ్మిట్‌లో బ్రిక్స్‌ను తొలిసారిగా విస్తరించిన తర్వాత జరుగుతున్న తొలి శిఖరాగ్ర సమావేశం ఇదేనని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. సమ్మిట్ మంగళవారం(అక్టోబర్ 22న) ప్రారంభం అవుతుంది. ప్రధాన సమావేశం బుధవారం(అక్టోబర్ 23న జరుగుతుంది. సమ్మిట్ సందర్భంగా, ప్రధాన మంత్రి కొన్ని ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.