Tariff: ఇటీవల కాలంలో టీవీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపించిన ప్రతిచోట టారిఫ్ అనే మాట బాగా వినిపిస్తుంటుంది. ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే అనేక దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నారు. ఇంతకీ ఈ టారిఫ్ అంటే ఏమిటి? ఇది ఎలా మొదలైంది? అసలు దీనిని ఎందుకు విధిస్తారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Also Read: అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా టీఆర్‌ఎస్.. అమెరికా సంచలన ప్రకటన!
టారీఫ్ అంటే ఏంటి ?
ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులనే టారిఫ్ అని అంటారు. దీన్నే ఇంపోర్ట్ డ్యూటీ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, మన దేశం నుంచి ఏవైనా వస్తువులు అమెరికాకు ఎగుమతి అయినప్పుడు, ఆ దేశం వాటిపై పన్నులు విధిస్తుంది దాన్నే టారీఫ్ అని అంటారు. టారిఫ్‌లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి.
యూనిట్ ఆధారిత టారిఫ్ : ఇందులో ప్రతి యూనిట్‌పై ఒక నిర్దిష్ట పన్ను విధిస్తారు. అంటే, ఒక రిఫ్రిజిరేటర్ దిగుమతి చేసుకుంటే దాని మీద 10డాలర్ల చొప్పున పన్ను విధిస్తారు. వస్తువు విలువతో సంబంధం లేకుండా, ప్రతి యూనిట్‌కు ఒకే విధమైన పన్ను ఉంటుంది.
విలువ ఆధారిత టారిఫ్ : ఇది వస్తువు విలువలో కొంత శాతాన్ని పన్నుగా విధిస్తుంది. అంటే, అదే రిఫ్రిజిరేటర్ ధర 100డాలర్లు ఉన్నట్లయితే, దానిలో 15% టారిఫ్ విధించారు అనుకుంటే, 15డాలర్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వస్తువు విలువ మారినప్పుడు పన్ను కూడా మారుతుంది.
టారిఫ్‌లను ఎందుకు విధిస్తారు?
దేశాలు టారిఫ్‌లను విధించడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇతర దేశాల నుండి చౌకగా దిగుమతి అయ్యే వస్తువుల వల్ల స్థానిక కంపెనీలు నష్టపోకుండా కాపాడేందుకు టారిఫ్‌లు విధిస్తారు. టారిఫ్‌లు దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను పెంచుతాయి. తద్వరా స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులు మరింత పోటీగా మారుతాయి. ఇది దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుంది… ఇక్కడ ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది.
సాధారణంగా టారిఫ్‌లు ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కూడా పనిచేస్తాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం డబ్బును సంపాదిస్తుంది. దీనిని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. విదేశీ వస్తువుల దిగుమతిని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి టారిఫ్‌లు ఒక సాధనంగా పని చేస్తాయి. ఇది దేశం వాణిజ్య లోటును తగ్గించడంలో సాయపడుతుంది.
Also Read: చైనా మస్కిటో డ్రోన్స్.. శత్రుదేశాలే లక్ష్యంగా తయారీ..!
కొన్నిసార్లు, ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా వారికి అనుకూలంగా వాణిజ్య ఒప్పందాలను సాధించడానికి టారిఫ్‌లను ఒక బేరసారాల సాధనంగా ఉపయోగిస్తారు. దేశ భద్రతకు ముఖ్యమైన కొన్ని ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడానికి లేదా కంట్రోల్ చేసేందుకు కూడా టారీఫ్ లు ఉపయోగపడుతాయి. ఉదాహరణకు, రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలు లేదా కీలక సాంకేతికతలపై టారిఫ్‌లు విధించవచ్చు.