US Tornadoes : అమెరికాపై ప్రకృతి మరోమారు ప్రకోపించింది. ఈసారి టోర్నడోలు రూపంలో విరుచుకుపడింది. దీంతో మూడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. మే 16–17 తేదీల్లో సంభవించిన తీవ్రమైన టోర్నడోలు కెంటకీ, మిస్సోరీ, ఇల్లినోయీ రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులను సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా కనీసం 23 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. భవనాలు, విద్యుత్ లైన్లు, చెట్లు ధ్వంసమై, లక్షలాది గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) ఈ టోర్నడోలను EF3 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో గుర్తించింది, ఇవి గంటకు 60 మైళ్ల వేగంతో దాటిపోయాయి.
Also Read : నాగార్జున దెబ్బకి తమిళ ఇండస్ట్రీ రికార్డ్ లు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
టోర్నడోలు కెంటకీలోని లారెల్ కౌంటీలో తీవ్ర విధ్వంసం సృష్టించి, కనీసం 14 మంది మృతి చెందారు. గవర్నర్ ఆండీ బేషియర్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 99 వేల మంది విద్యుత్ లేకుండా ఉన్నారని తెలిపారు. సోమర్సెట్, హాప్కిన్స్‌విల్లే ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. ఐదు కౌంటీలు అత్యవసర స్థితిని ప్రకటించాయి.
మిస్సోరీలో ధ్వంసం
మిస్సోరీలోని సెయింట్ లూయీ, క్లేటన్ ప్రాంతాల్లో టోర్నడోలు భారీ నష్టాన్ని కలిగించాయి. కనీసం ఏడుగురు మృతి చెందారు. సెంటెనియల్ క్రిస్టియన్ చర్చి భాగం కూలిపోగా, 5 వేల భవనాలు దెబ్బతిన్నాయి. 84 వేల Výృహాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. స్కాట్ కౌంటీలో ఇద్దరు మతి చెందారు, అనేక గృహాలు నాశనమయ్యాయి.
ఇల్లినోయీలో టోర్నడో హెచ్చరికలు..
ఇల్లినోయీలోని మారియన్, పటోకా ప్రాంతాల్లో టోర్నడో ఎమర్జెన్సీ జారీ చేయబడింది. రాడార్ ఆధారంగా గుర్తించిన ఈ టోర్నడోలు గంటకు 45 మైళ్ల వేగంతో కదిలాయి. బేస్‌బాల్ సైజు వడగళ్లు, గంటకు 79 మైళ్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. నష్టం, గాయాల వివరాలు ఇంకా సేకరిస్తున్నారు.
సహాయక చర్యలు..
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్, మిస్సోరీ, కెంటకీ, ఇల్లినోయీ గవర్నర్‌లతో మాట్లాడి ఫెడరల్ సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. సెయింట్ లూయీలో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇంటింటి సోదాలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు, చిత్రాలు ఈ విధ్వంసం యొక్క తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
ఈ టోర్నడోలు కేవలం కెంటకీ, మిస్సోరీ, ఇల్లినోయీలోనే కాకుండా ఇండియానా, వర్జీనియా వంటి రాష్ట్రాలను కూడా ప్రభావితం చేశాయి, మొత్తం 26 టోర్నడోలు నమోదయ్యాయి. అధికారులు రెస్క్యూ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు మెరుగైన సన్నద్ధత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.