Trump Diwali celebration: దీపావళి వేడుకలు భారత్‌లో ఘనంగా జరిగాయి. దీపాల వెలుగులో దేశంలోని ఊరూవాడ, పల్లె పట్టణాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఊరూరా బాంబుల మోత మోగింది. ఇక దీపావళి వేడుకలు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తగా కూడా చాలా దేశాల్లో హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోనూ ఎన్‌ఆర్‌ఐలు అధ్యక్షుడు ట్రంప్‌తో దీపం వెలిగించి భారతీయతను, హిందూ సంప్రదాయాన్ని చాటారు. మంగళవారం(అక్టోబర్ 21న) సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా హాజరై భారతీయ సమాజానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపం వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్–అమెరికా బంధానికి మరో సానుకూల సంకేతం అందించాయి.
ట్రంప్ దీపావళి సందేశం..
దీపావళి ఆధ్యాత్మిక సారాంశాన్ని ట్రంప్ తన ప్రసంగంలో విపులంగా వివరించారు. ఈ పండుగ చీకటిపై వెలుగును, అజ్ఞానంపై జ్ఞానాన్ని, చెడుపై మంచిని సూచిస్తుందన్నారు. దీపం మనసులోని సానుకూల శక్తిని మేల్కొలిపి, శ్రమ, వినమ్రత, కృతజ్ఞతల విలువను గుర్తు చేస్తుందని వివరించారు. ఈ సందేశం
ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
మోదీపై ప్రశంసలు..
ట్రంప్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన చర్చను ప్రస్తావించారు. ప్రపంచ వాణిజ్యం, ప్రాంతీయ శాంతి, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలపై ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చ సాగిందని తెలిపారు. మోదీని ‘‘ప్రతిభావంతుడైన నాయకుడు, నిజమైన మిత్రుడు’’ అని ప్రశంసలు కురిపించారు. భారత్–పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొని ఉండటం సంతోషకరమని పేర్కొంటూ, అది ద్వైపాక్షిక సంప్రదింపుల విజయాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
భారత సంస్కృతి జిగేల్..
ఇక దీపావళి వేడుకల సందర్భంగా వైట్ హౌస్‌లో భారతీయ సంస్కృతి ప్రతిబింబించే ఆచారాలు వాతావరణాన్ని మరింత పరిమళింపజేశాయి. ఈ కార్యక్రమానికి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ఓడీఎన్‌ఐ డైరెక్టర్ తులసి గబ్బర్డ్, అమెరికా–భారత్ రాయబారులు వినయ్ మోహన్ క్వాత్రా, సెర్గియో గోర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, భారతీయ వాణిజ్య రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉత్సవం ఇరుదేశాల సాంస్కృతిక సామరస్యానికే కాకుండా పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
⚡ US President Trump lights a diya in the Oval Office to celebrate Diwali. pic.twitter.com/yFfSgDiEse
— OSINT Updates (@OsintUpdates) October 22, 2025