Operation Trishul 2025: భారత దేశం సొంత భద్రత, శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఇదే సమయంలో దేశంలోకి చొరబాట్లను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతోంది. స్వదేశీ ఆయుధాల తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో దేశం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో ఒకేసారి సైనిక విన్యాసాలు చేపడుతోంది. గగనతల సురక్షణ కోసం ప్రభుత్వమే ముందస్తు హెచ్చరికలతో నోటామ్ జారీ చేసింది. సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
పడమరలో ఆపరేషన్ త్రిశూల్..
అరేబియా సముద్రతీరంలోని సర్‌క్రీక్(బాణగంగ) ప్రాంతంలో ఆపరేషన్ త్రిశూల్ విజయవంతంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగినది. సముద్ర మార్గ రక్షణకు నేవీ కీలక పాత్ర పోషిస్తూ రాడార్ నిఘా వ్యవస్థలు, అధునాతన మిసైల్ యూనిట్లు మోహరిస్తోంది.
తూర్పున పూర్వి ప్రచండ ప్రహార్
చైనా, బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దులకు సమీపంలోని సిరివిడి కారిడార్ ప్రాంతంలో పూర్వి ప్రచండ ప్రహార్ పేరుతో యుద్ధాభ్యాసం కొనసాగుతోంది. 15 నుంచి 22 కిలోమీటర్ల పొడవున ఈ వ్యూహాత్మక మార్గం ద్వారా శత్రు చొరబాట్లను నిరోధించడమే కాదు, త్రిశక్తి బలగాల సమన్వయం కూడా బలోపేతం అవుతోంది.
త్రిశక్తి బలగాల మోహరింపు..
అసోంలోని నదుల విస్తీర్ణం కారణంగా నేవీకి కీలక బాధ్యత వచ్చింది. రఫేల్స్, బ్రహ్మోస్, ఎస్–400 క్షిపణి వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడం ద్వారా గగనతల రక్షణను మరింత ధ్రుఢపరుస్తున్నారు. మూడు విభిన్న రక్షణ శాఖలు కలిసి పనిచేసే ‘‘త్రిశక్తి కోర్’’ ద్వారా సర్వదిశా భద్రతా వ్యవస్థ బలోపేతమవుతోంది.
మూడు కొత్త సైనిక స్థావరాలు..
ఇదే సమయంలో దేశంలోని ఈశాన్య భారతంలో మూడు సరికొత్త సైనిక కారిడార్లు నిర్మిస్తోంది. అసోం, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్త మిలిటరీ బేస్‌ల నిర్మాణం మొదలైంది. అసోంలోని దుగ్రి జిల్లా, బాముని గ్రామంలో లాచిట్ బర్ఫూకన్ పేరుతో ఆర్మీ బేస్ నిర్మాణం జరుగుతోంది. అసోం వీరయోధుడి స్ఫూర్తితో రూపొందిన ఈ స్థావరం మిసామారీ బేస్‌కు అనుబంధంగా సిరివిడి కారిడార్ భద్రతను చూసుకుంటుంది. ఇక రెండోది బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో నిర్మిస్తోంది. తూర్పు సరిహద్దులో రక్షణ వలయం ఏర్పరచే కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. మూడోది పశ్చిమబెంగాల్‌లోని చోప్రా గ్రామంలో జినాబ్ ప్రాంతంలో తెతూలియా కారిడార్ సమీపంలో నిర్మిస్తోంది. ఈ స్థావరం వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగినది. దీనిని నిర్మాణం పూర్తయితే పశ్చిమబెంగాల్‌లోని చాలా ప్రాంతాలకు దూరం తగ్గుతుంది.
అసోంలో గతంలో జరిగిన చొరబాట్లు, హింసాత్మక దాడులు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో సరిహద్దు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు సైన్యంతో సమన్వయం పెరగడం ఈ మార్పుకు కారణంగా ఉంది. తాజాగా బహుముఖ చర్యలతో భారతదేశం గగన, భూ, సముద్ర మార్గాల్లో త్రిముఖ సమన్వయంతో దేశ రక్షణను మరింత శత్రుదుర్భేధ్యంగా మార్చుతోంది.