US Fed Meeting 2024: ఉద్యోగాలు పోతున్నాయి.. కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టడం లేదు. పైగా ఉన్న వారిని అడ్డగోలుగా తీసేస్తున్నాయి. పరిశ్రమల్లో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. వస్తు సేవలకు డిమాండ్ పూర్తిగా తగ్గింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే పరిస్థితి బాగోలేదు. ఇక ముందు బాగుంటుందని నమ్మకం లేదు. ఇది ఎక్కడో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్నది అనుకుంటే పొరపాటే. అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంటున్నది. సిలికాన్ వ్యాలీగా, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా, భూతల స్వర్గం గా పేరుపొందిన అమెరికాలో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. లెమాన్ బ్రదర్స్, జనరల్ మోటార్స్ వంటి ఉదంతాలు ఒకప్పుడు అమెరికాను ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఈ స్థాయిలో ఒడిదుడుకులు మాత్రం అమెరికా ఎప్పుడు ఎదుర్కోలేదు. ఫలితంగా అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ 23 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉంచిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో దానిని స్థిరంగా ఉంచి.. అంటే రెండు శాతం వరకే పరిమితం చేసి.. ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఫెడరల్ బ్యాంకు చెబుతోంది.. పరిస్థితులను చూస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే దాఖలాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బుధవారం అమెరికన్ ఫెడరల్ బ్యాంకు అధ్యక్షుడు పావెల్ ఆధ్వర్యంలో వడ్డీరేట్లపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ భావించారు.. కానీ అటువంటి తీపి కబురును ఫెడరల్ బ్యాంక్ ప్రకటించలేదు. బెంచ్ మార్క్ వడ్డీరేట్లు 5.25% నుంచి 5.50% వరకు కొనసాగించారు. గత నాలుగు త్రైమాసికాలలో ఫెడరల్ బ్యాంకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నది. అంతేకాదు పాలసీ రేటును 23 సంవత్సరాల గరిష్టానికి పెంచింది అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ద్రవ్య వినిమయ విధానం మారపోకపోవడంతో.. మార్చి నుంచి రేట్ల తగ్గింపు ఉండదని పెట్టుబడిదారులు నిట్టూర్చుతున్నారు. 2022 మార్చి నుంచి పాలసీ రేటును 5.25% పాయింట్లు మేర అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ పెంచింది. దీంతో అమెరికావ్యాప్తంగా ద్రవ్య లభ్యత తగ్గిపోయింది.. ధరల ఒత్తిళ్లు పెరిగిపోయినప్పటికీ అమెరికన్ ఫెడరల్ బ్యాంకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మరోవైపు జూలై నుంచి పాలసీ విధానాన్ని కూడా కేంద్ర బ్యాంక్ నిలిపివేసింది. ఇక బుధవారం సమావేశమైన ఫెడరల్ బ్యాంక్ కార్యవర్గం వడ్డీ రేట్ల విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు ప్రకటించకుండానే యధాస్థితి అమలవుతుందని వివరించింది. అంతేకాదు మార్చి 19-20 తేదీల్లో తదుపరి సమావేశం కావాలని నిర్ణయించింది. ఇక అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ బుధవారం తీసుకున్న నిర్ణయం కారణంగా అమెరికన్ డాలర్ యూరోతో పోల్చితే కొంతమేర లాభపడింది. చైనా యెన్ తో పోల్చితే కొంతమేర నష్టాలను తగ్గించింది.. ఇక చాలామంది ఇన్వెస్టర్లు ఊహించిన ధరలకంటే డాలర్ ఇండెక్స్ చివరి రోజున 0.26 శాతం పెరిగి 103.66 గా నమోదయింది. ఈ నెలలో ఇండెక్స్ 2.3 శాతం లాభాన్ని నమోదు చేయడం విశేషం. సెప్టెంబర్ నెల తర్వాత డాలర్ ఇండెక్స్ లాభాన్ని నమోదు చేయడం ఇది రెండవసారి.
ఇక అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా యధాస్థితి అమలవుతుందని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అంతకుముందు సెషన్ లో ఒక శాతం పెరిగిన తర్వాత స్పాట్ బంగారం ధర 0.1% తగ్గింది. అమెరికన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 2,034.37 డాలర్ల వద్ద నమోదయింది.. ఫెడరల్ బ్యాంక్ సమావేశానికి అంటే ముందు ఔన్స్ బంగారం ధర 2000 డాలర్ల కంటే ఎక్కువ ఉండేది.. భవిష్యత్తు కాలంలో ఔన్స్ బంగారం 2067.4 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని రాయిటర్స్ సంస్థ అంచనా వేస్తోంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ సమావేశానికి ముందు రోజే వడ్డీరేట్లు తగ్గించే పరిస్థితి లేదనే సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ర్యాలీ చల్లబడింది.. అయినప్పటికీ అమెరికన్ బ్యాంకులు తక్కువ లాభాలనే నమోదు చేశాయి. “ఫెడరల్ బ్యాంకు నిర్ణయంతో అమెరికన్ మార్కెట్లు 15 బేసిస్ పాయింట్లు కోల్పోయాయి.. కార్పొరేట్ రుణాల బేస్ లైన్ ఆరు బేసిస్ పాయింట్ తగ్గి 3.97 శాతంగా నమోదు కావచ్చని” రాయిటర్స్ అభిప్రాయపడింది. మొత్తానికి అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ సమావేశం కొత్తగా ఏ నిర్ణయం తీసుకోకపోవడం భవిష్యత్ పై భయాన్ని సూచిస్తోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.