Pakistan Air Bases: మనం ఒక ఇంటిని నిర్మించుకున్నామనుకోండి. అందులో అద్భుతమైన సౌకర్యాలు కల్పించుకున్నాం. అందులోకి పరాయి వ్యక్తి వచ్చి పెత్తనం సాగి స్తే ఎలా ఉంటుంది.. మన ఇంట్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది.. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. పాకిస్తాన్ దరిద్రం వల్ల దాయాది దేశం నెత్తి మీద ఎక్కిన అమెరికా సవారీ చేస్తోంది.
ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్ళాడో.. ట్రంప్ కంపెనీలకు ఖనిజాలు తవ్వుకునే అవకాశం ఇచ్చాడో.. అప్పుడే అందరికీ సినిమా అర్థమైంది. పాకిస్తాన్ జుట్టు అమెరికా చేతిలో ఉందని అవగతమైనది. వాస్తవానికి పాకిస్తాన్ అమెరికా చేతిలో బందీ లాంటి దేశం. ఇప్పుడు ఆ బానిస స్థాయి మరింత పెరిగిపోయింది. తాజాగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన ఒక కథనం పాకిస్తాన్ బేల స్థితిని బయట పెడుతోంది.
పాకిస్తాన్ దేశానికి చెందిన ఎయిర్ బేస్ లు అమెరికా చేతులలోకి వెళ్లిపోయాయి. పాకిస్తాన్లోని నూరు అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్ అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడ ఎఫ్ 35.. ఎఫ్ 16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను అమెరికా మొహరింపజేసింది. ఈ ఎయిర్ బేస్ లు పాకిస్తాన్ దేశానికి చెందిన న్యూక్లియర్ వెపన్స్ నిల్వ కేంద్రాలకు (కైరానా హిల్స్) కు దగ్గరగా ఉంటాయి. అందువల్లే వీటి మీద అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ యుద్ధ విమానాలను మోహరింపజేసింది. మాజీ ఐఎస్ఐ చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ తన భూభాగంలో మూడు ఎయిర్ బేస్ లను అమెరికాకు అప్పగించిందని తెలుస్తోంది. అమెరికన్ దళాలు ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. చివరికి పాకిస్తాన్ సైనికులు కూడా లోపలికి అనుమతించడం లేదు..
భవిష్యత్ కాలంలో చైనాతో ఏమైనా అవరోధాలు ఎదురైనప్పుడు.. భారత్ కాలర్ ఎగరేసినప్పుడు.. తనకంటూ ఒక స్థావరం కావాలి కాబట్టి.. పాకిస్తాన్ దేశాన్ని అమెరికా ఎంచుకుంది. పైగా ఇప్పుడు అమెరికా సహాయం కోసం పాకిస్తాన్ చేతులు చాచి ఉంది. అనేక సందర్భాల్లో అమెరికా ప్రాపకం కోసం పాకిస్తాన్ తాపత్రయపడింది. పాకిస్తాన్ ఆర్థిక అవసరాలు అమెరికాకు తెలుసు. అందువల్లే అమెరికా జుట్టు చేతిలో పట్టుకుంది. కీలకమైన వైమానిక స్థావరాలను తన చేతిలోకి తీసుకుంది. తద్వారా ఆసియాలో అత్యంత కీలకమైన చైనాకు దగ్గరగా అమెరికా పట్టు సాధించింది.
