US H1B Visa News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచించాక వెనుకడుగు వేస్తున్నారు. టారిఫ్‌ల విషయంలో ఇలాగే జరుగుతోంది. తాజాగా హెచ్–1బీ వీసాల విషయంలోనూ ట్రంప్ మళ్లీ వెనక్కు తగ్గారు. హెచ్–1బీ వీసాలపై భారీ ఫీజు విధానంలో సడలింపులు ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. మొదట ఈ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారిని లక్ష డాలర్లు చెల్లించాల్సిందిగా చట్టం తీసుకువచ్చినా, అమలులో అనేక సందేహాలు తలెత్తడంతో ఆ నిబంధనను పునర్‌సమీక్షించింది.
అమెరికాలో ఉన్నవారికి ఫీజు మాఫీ..
యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అమెరికాలో ఇప్పటికే ఉన్నవారు వీసా స్థితి మార్చుకున్నా..అంటే ఎఫ్–1 (స్టూడెంట్) లేదా ఎల్–1 నుంచి హెచ్–1బీకి మారినా లక్ష డాలర్ల ఫీజు వర్తించదు. ఇదే సడలింపు ఇప్పటికే హెచ్–1బీ వీసా పొందినవారు లేదా దాని పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునేవారికీ వర్తిస్తుంది.
దేశం వెలుపల దరఖాస్తుదారులకే ఫీజు..
సెప్టెంబర్ 21 తర్వాత అమెరికా వెలుపలి దేశాల నుంచి కొత్తగా హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే అదనపు ఫీజు విధానం అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారికి ఈ చెల్లింపు అవసరం లేదు. ఈ మార్పు కొత్త అభ్యర్థులు, ముఖ్యంగా ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్‌ల నుంచి వచ్చే వారిపై మాత్రమే ప్రభావం చూపనుంది.
విద్యార్థులకు పెద్ద ఊరట..
అమెరికాలో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు ఈ నిర్ణయంతో భారీ ఉపశమనం పొందారు. స్టూడెంట్ వీసాపై ఉద్యోగం సాధించినప్పుడు హెచ్–1బీకి మారడానికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందారు. ఇప్పుడు స్పష్టత రావడంతో కంపెనీలు సులభంగా నియామకాలు చేయగల పరిస్థితి ఏర్పడింది.
కోర్టు తీర్పుకు ముందే పరిష్కారం..
చాంబర్ ఆఫ్ కామర్స్, ఐటీ సంస్థలు ఈ ఫీజు చట్టంపై కోర్టు మార్గం ఎంచుకున్నా, ప్రభుత్వం తీర్పు రాకముందే మార్పు ప్రకటించడం సానుకూల పరిణామంగా భావించబడుతోంది. రానున్న సంవత్సరాల్లో హెచ్–1బీ వీసా విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చుతామని ట్రంప్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
హెచ్–1బీ వీసా సడలింపులతో అమెరికాలో పనిచేస్తున్న టెక్ ప్రొఫెషనల్స్, విద్యార్థులకు తాత్కాలిక భరోసా లభించింది. ప్రభుత్వం శాశ్వత సంస్కరణలు చేపట్టే వరకు హెచ్–1బీ వీసా విధానం తాత్కాలిక ఊపిరి పీల్చుకున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.