Brian Thompson:యునైటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ యూనిట్ సీఈవో అయిన బ్రియాన్ థాంప్సన్ బుధవారం (డిసెంబర్ 4) ఉదయం మిడ్‌టౌన్ మాన్హాటన్లోని హిల్టన్ హోటల్ వెలుపల కాల్చి చంపబడ్డాడు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ (NYPD) ఉదయం 6:40 గంటలకు 50 ఏళ్ల అతడి పై కాల్పులు జరిపినట్లు ధృవీకరించింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు పేరును వెల్లడించనప్పటికీ.. మరణించిన వ్యక్తి థాంప్సన్ అని పలు నివేదికలు నిర్ధారించాయి. పోలీసుల విచారణలో ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేసినట్లు తేలింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. సంఘటనకు ముందు నిందితుడు చాలా కాలం పాటు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితుడు క్రీమ్ కలర్ జాకెట్, గ్రే బ్యాక్ ప్యాక్ ధరించి కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.
మాన్‌హట్టన్‌లో యునైటెడ్‌హెల్త్ ఇన్వెస్టర్ల సదస్సు జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సుమారు ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైన గంట తర్వాత, యునైటెడ్ హెల్త్ గ్రూప్ సీఈవో ఆండ్రూ విట్టి దానిని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మా టీమ్ మెంబర్లలో ఒకరికి తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంది కాబట్టి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఆయన అన్నారు.
ఘటనా స్థలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
సమాచారం మేరకు ఘటనా స్థలంలో పోలీసులు 54వ వీధిని చుట్టుముట్టారు. అక్కడ చాలా బుల్లెట్ కేసింగ్‌లు, ప్లాస్టిక్ గ్లౌజులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉదయం 7 గంటలకు తుపాకీ శబ్దాలు వినడం మామూలేనని.. చాలా భయానకంగా ఉందని హోటల్ సమీపంలో పనిచేసే క్రిస్టియన్ డియాజ్ తెలిపారు.
బ్రియాన్ థాంప్సన్ సహకారం
ఏప్రిల్ 2021లో యునైటెడ్‌హెల్త్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బ్రియాన్ థాంప్సన్, 2004 నుండి కంపెనీలో ఉన్నారు. అతని నాయకత్వ సామర్థ్యాలు, సహకార విధానం కారణంగా అందరి చేత ప్రశంసలు పొందాడు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ అతని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
అమెరికాలో ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ సవాళ్లు
థాంప్సన్ హత్య అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, అది ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా దృష్టిని ఆకర్షించింది. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ హెల్త్ అనుబంధ సంస్థలో సైబర్ హ్యాక్ , డేటా దొంగతనం వంటి సంఘటనలు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను కదిలించాయి. ఈ సంఘటన ఆరోగ్య సంరక్షణలో పెరుగుతున్న భద్రత, పారదర్శకత గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది.