Donald Trump: అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దూకుడు విధానాలతో ఏడాది పాలన కూడా గడవక ముందే వ్యతిరేకత తెచ్చుకున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రపంచ దేశాలపై ఆంక్షలు, టారిఫ్‌లు విధించి వ్యతిరేకత పెంచుకున్నాడు. ఇదే సమయంలో టారిఫ్‌ల ప్రభావం అమెరికన్లపైనా పడింది. ఇంకోవైపు అమెరికా భారీ షట్‌డౌన్ ఎదుర్కొంది. సుదీర్ఘ షట్‌డౌన్ ఇటీవలే ముగిసింది. షట్‌డౌన్ కారణంగా అమెరికాలో చాలా మంది వేతనాలు అందక ఇబ్బంది పడ్డారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌పైనా వాణిజ్య పరిమితులు, ప్రత్యేక ఆంక్షలు విధించి గ్లోబల్ మార్కెట్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించాడు. దీంతో అమెరికాన్లు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నో కింగ్ పేరుతో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే తాజా పరిణామాలు ట్రంప్ రాజకీయ యాత్రలో మార్పు సూచిస్తున్నాయి.
వినియోదారులకు టారిఫ్‌ల దెబ్బ..
ట్రంప్ విధించిన అధిక సుంకాల కారణంగా అమెరికాలో చాలా వస్తువుల ధరలు పెరిగాయి. ఇదే సమయంలో సామన్యుల నెటవారీ బడ్జెట్ కూడా 1,500 డాలర్లు పెరిగింది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. బీఫ్, కాఫీ, ట్రాపికల్ పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ వినియోగదారులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రారంభించారు. ఫలితంగా పట్టణాలు, రాష్ట్రాల్లో నిరసనలు వెదజల్లాయి. దీని ప్రభావం న్యూయార్క్ ఎన్నికల్లో కనిపించింది. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు. దీంతో ప్రజల కోపం చల్లార్చేందుకు ఆయన ప్రభుత్వం కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తలొగ్గక తప్పలేదు..
‘అమెరికా ఫస్ట్‘ నినాదాన్ని కఠినంగా అమలు చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రజా ఒత్తిడికి లోనై సమతుల్య నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. ప్రజల జీవనశైలి, మార్కెట్ స్థితిగతులు నేరుగా రాజకీయ ప్రభావం చూపుతాయని ఈ పరిణామం నిరూపించింది. నిత్యావసర ధరలు తగ్గించారు. ట్రంప్ తన కఠిన విధానాలను మార్చుకుంటే ఇండియా–అమెరికా వ్యాపార సంబంధాలకు కొత్త ఊపు లభించే అవకాశం ఉంది.
ట్రంప్ రాజకీయ వారసత్వంలో ఇది కొత్త మలుపుగా నిలుస్తోంది. ప్రజా ఆర్థిక ప్రయోజనాల ముందు కూడా కఠిన నాయకులు తల వంచాల్సిందే అని అమెరికా ఉదాహరణ మరోసారి చెబుతోంది.