Trump wants a Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను ప్రపంచ శాంతి స్థాపకుడిగా ప్రకటించుకుంటూ, ఆరేడు యుద్ధాలను ఆపినట్లు చెప్పుకుంటున్నారు. థాయిలాండ్–కంబోడియా, ఇండియా–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్ వంటి సంఘర్షణలను సమర్థవంతంగా చెప్పుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతికి తనను మించిన వ్యక్తి లేడని డప్పు కొట్టుకుంటున్నారు. కానీ, ఇజ్రాయెల్ గాజాపై దాడులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్–సంబంధిత సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ట్రంప్ తన 2.0 పదవీకాలంలో ఇండియా–పాకిస్తాన్, థాయిలాండ్–కంబోడియా, ఇజ్రాయెల్–ఇరాన్, ఆర్మేనియా–అజర్‌బైజాన్, రువాండా–కాంగో వంటి యుద్ధాలు ఆపి శాంతి ఒప్పందాలను సాధించినట్లు పేర్కొంటున్నారు. పాకిస్తాన్, ఇజ్రాయెల్, కంబోడియా వంటి దేశాలు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాయి, ఆయన దౌత్య నైపుణ్యాన్ని కొనియాడాయి. అయితే, ఈ ఒప్పందాలలో ట్రంప్ పాత్రపై వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇండియా–పాకిస్తాన్ సంఘర్షణలో ట్రంప్ జోక్యం చేసుకున్నారని పాకిస్తాన్ పేర్కొనగా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ సంఘర్షణను ద్వైపాక్షికంగా పరిష్కరించినట్లు స్పష్టం చేశారు, ట్రంప్ పాత్రను తోసిపుచ్చారు. ఇది ట్రంప్ శాంతి ప్రయత్నాలు రాజకీయ లాభం కోసం అతిశయోక్తిగా చిత్రీకరించబడుతున్నాయనే సందేహాలను రేకెత్తిస్తోంది.
ఆగని ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ యుద్ధం..
ట్రంప్ ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఒక స్వల్పకాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్ గాజాపై దాడులను కొనసాగిస్తోంది, దాదాపు 60 వేల మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైందని అంచనా. ట్రంప్ ఇజ్రాయెల్‌కు ఆయుధ సహాయం అందిస్తూనే, గాజాలో మానవతా సంక్షోభాన్ని గుర్తించారని, ఆహార సహాయాన్ని పెంచాలని పేర్కొన్నారు. అయినప్పటికీ, గాజాను ‘అంతర్జాతీయ బీచ్ రిసార్ట్‘గా మార్చాలనే ఆయన వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ ‘గ్రేటర్ ఇజ్రాయెల్‘ ప్రణాళికకు మద్దతుగా విమర్శకులు భావిస్తున్నారు. ఇది శాంతి కాముకుడిగా చెప్పుకుంటున్న ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం..
ఇక ట్రంప్ తన పదవీ బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది, రష్యా దాడులు ఆగడం లేదు. ఉక్రెయిన్ పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు ఒలెక్సాండర్ మెరెజ్కో ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినప్పటికీ, ఆయనపై నమ్మకం కోల్పోయి నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ట్రంప్ దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ట్రంప్ రష్యాతో చర్చలు జరిపినప్పటికీ, ఆయన విధానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఇది ట్రంప్ శాంతి స్థాపకుడిగా చెప్పుకునే హక్కును ప్రశ్నార్థకం చేస్తుంది.
యెమెన్, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి..
ట్రంప్ ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సాధించినట్లు పేర్కొన్నారు, కానీ ఈ ఒప్పందం జూన్ 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సదుపాయాలపై దాడులు చేసిన తర్వాత, అమెరికా కూడా మూడు ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసింది, ఈ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించాయని పాకిస్తాన్ వంటి దేశాలు ఖండించాయి. ఇరాన్ మద్దతునిచ్చే హౌతీలు, యెమెన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి, యెమెన్ అధ్యక్షుడిపై క్షిపణి దాడిచేసింద. ఆయన బతికన్నారా లేదా అన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఈ విరుద్ధమైన విధానాలు ట్రంప్ శాంతి ప్రయత్నాలను సంక్లిష్టం చేస్తున్నాయి. నోబెల్ ప్రైజ్ ఆశలను సంక్లిష్టం చేస్తున్నాయి.
ఆశలు.. వాస్తవాలు..
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రచారం ఊపందుకుంది, పాకిస్తాన్, ఇజ్రాయెల్, కంబోడియా, ఆర్మేనియా, అజర్‌బైజాన్ వంటి దేశాల నుంచి నామినేషన్లు వచ్చాయి. అయితే, ఈ నామినేషన్ల వెనుక రాజకీయ లాభాలు, వాణిజ్య ఒప్పందాల కోసం దేశాలు ట్రంప్‌కు అనుకూలంగా నిలబడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నోబెల్ కమిటీ సభ్యులలో ముగ్గురు ట్రంప్‌ను బహిరంగంగా విమర్శించారని, ఆయనకు ఈ బహుమతి దక్కే అవకాశం తక్కువగా ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతి అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే వారికి ఇస్తారు. కానీ ట్రంప్ యొక్క ‘అమెరికా ఫస్ట్‘ విధానం, వాణిజ్య యుద్ధాలు, ఇజ్రాయెల్‌కు అనుకూల విధానాలు ఈ ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్నాయి.