Trump Tariff Effect: ట్రంప్ టారిఫ్‌ల మోతకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికాలోనూ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని ఆదేశ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టారిఫ్(Tariff) ప్రభావంతో ఇరాన్ కరెన్సీ, ఇరానియన్ రియాల్ (IRR), మళ్లీ భారీ పతనాన్ని చవిచూసింది. ఒక అమెరికన్ డాలర్(Amercian Dollar)తో పోలిస్తే రియాల్ విలువ 10,43,000కి చేరుకుని చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయిని తాకింది. ఈ సంక్షోభం నేపథ్యంలో రానున్న రోజుల్లో దీని విలువ ఎంతమేరకు తగ్గుతుందన్నది అనిశ్చితంగా మారింది. టెహ్రాన్‌లోని ఫెర్హౌసీ వీధి, దేశంలో కరెన్సీ మారక కేంద్రంగా ఉన్నప్పటికీ, అనేక మంది వ్యాపారులు నగదు బదిలీ వ్యాపారాన్ని నిలిపివేశారు.
నౌరూజ్ సెలవుల ప్రభావం
పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజ్(Nourooj)సందర్భంగా ఇటీవల సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కరెన్సీ మార్కెట్లు మూతపడటంతో వీధుల్లో అనధికారిక ట్రేడింగ్ మాత్రమే జరిగింది. దీంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి, సెలవుల తర్వాత శనివారం(Saturday) పని రోజులు పునఃప్రారంభమైనప్పుడు రియాల్ విలువ ఒక్కసారిగా 10,43,000కి పడిపోయింది. ఈ ఆకస్మిక పతనం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది.
అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యం
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం సంతకం చేసినప్పుడు ఒక డాలర్ విలువ 32,000 రియాల్స్‌గా ఉండేది. అయితే, 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగడం, ఆ తర్వాత ట్రంప్ పరిపాలనలో ‘మాక్సిమం ప్రెజర్’ విధానంతో కఠిన ఆంక్షలు విధించడంతో రియాల్ విలువ భారీగా పడిపోయింది. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పతనం వేగవంతమైంది.
ఆర్థిక పరిణామాలు, భవిష్యత్తు
రియాల్ పతనం వల్ల ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 40% దాటింది. ఆహార ధరలు కొన్ని సందర్భాల్లో 100% వరకు పెరిగాయి. సామాన్య ప్రజలు తమ ఆదాయాన్ని డాలర్లు, బంగారం వంటి సురక్షిత ఆస్తుల్లోకి మార్చడం వల్ల రియాల్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయకపోతే, ఈ సంక్షోభం తీవ్రతరమై ఆర్థిక స్థిరత్వం మరింత దెబ్బతింటుంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉంది, లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.