Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించాడు. 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త ప్రభుత్వంలో కీలక బాధ్యతలకు సంబంధించిన కూర్పు పనుల్లో ఉన్నారు. ఇప్పటికే కొందరిని ఎంపిక చేశారు. విధేయులు, సమర్థులకు పదవులు అప్పగించారు. అయితే, ట్రంప్ ఎన్నికల సమయంలో బైడెన్ ప్రభుత్వం యుద్ధాలతో అమెరికా ప్రజల సొమ్మును వృథా చేస్తుందని ఆరోపించారు. తాను అదికారం చేపట్టిన గంటల వ్యవధిలో యుద్ధాలు ఆపేస్తానని ప్రకటించారు. దీనికి అమెరికన్లు మద్దతు తెలిపారు. ట్రంప్‌కు పట్టం కట్టారు. మరోవైపు యుద్ధాలు ఆపేదిశగా చర్యలుచేపడుతున్నట్లు డోస్ కో చైర్మన్ ఎలాన్ మస్క్ ఇరాన్ విదేశాంగ శాఖ అధికారులతో మంతనాలు జరిపారు. దీంతో ట్రంప్ బాధ్యతలు చేపట్టాక యుద్ధాలు ఆగుతాయని అంతా అనుకుంటున్నారు. కానీ, తాజాగా ఆయన చేసిన ప్రకటన అమెరికన్లను షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ట్రంప్ కూడా హమాస్‌కు మాస్ వర్నింగ్ ఇచ్చారు. బందీలను విడిచిపెట్టకుంటే నరకం చూపిస్తామని హెచ్చరించారు.
బందీల వీడియో విడుదల..
ఇదిలా ఉంటే.. హమాస్ ఇటీవలే బందీలకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలిటెండ్ సంస్థపై విరుచుకుపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టక ముందే వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా నేను 2025, జనవరి 20న బాధ్యతలు చేపడతాను.ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేదంటే దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తా. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేలా..
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలటరీలో భాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా–ఇజ్రాయెల్ జాతీయుడు ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడాడు. ‘నేను 420 రోజుల నుంచి హమాస్ బందీలో ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి’ అని వేడుకున్నాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించింది. ఎడాన్‌తో సహా బందీలందరినీ విడిపిస్తానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ట్రంప హమాస్కు వార్నింగ్ ఇచ్చారు.
ఏడాది దాటినా..
ఇదిలా ఉంటే.. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఏడాది దాటింది. సుమారు 1,200 మందికిపైగా హమాస్ మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకు తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా కాల్పుల విరమణ జరిగి కొందరిని విడుదల చేసింది. తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతిచెందారు. ప్రస్తుతం 51 మంది బందీగా సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి..
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. టెల్‌అవీవ్ తొలుత ఉల్లంఘనకు పాల్పడిందని హెజ్‌బొల్లా ఆరోపిస్తూ దళాలను లక్ష్యంగా చేసుకుని ప్రాజెక్టులను ప్రయోగించింది. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్ తీవ్రంగా ఖండించారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హెజ్‌బొల్లా కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు.