Trump Iran Sudden Peace: ఇరాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం.. కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తాం. హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటాం. ల్యాండ్ ఆర్మీని దించుతున్నాం. ఇరాన్ వెంటనే ఒప్పందం చేసుకోవాలి.. లేకుంటే ఇదే ఇరాన్‌కు చివరి రాత్రి అని తీవ్ర స్వరంతో హెచ్చరించిన ట్రంప్.. కొన్ని గంటల్లోనే శాంతి మార్గం ఎంచుకున్నారు. దుర్భాషలతో అవతలివారిపై విరుచుకుపడి అసహనం చూపిన ఆయన స్వరం ఎందుకు మార్చుకున్నారు? ఈ మలుపు పశ్చిమాసియా ఘర్షణల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రంప్ బెదిరింగ్‌లు ఫలితం ఇచ్చాయా? రెండు వారాల కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది?
Also Read: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు
బాహ్య ఒత్తిళ్లతో తగ్గిన ట్రంప్..
ఘర్షణ పెరగకుండా ఉండాలని అమెరికాను ఒప్పించడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతోపాటు ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా గట్టి ప్రయత్నాలు చేసింది. అమెరికాలో డెమోక్రటిక్ శాసకులు ట్రంప్ హెచ్చరికలను ‘నైతిక ఓటమి‘గా ఖండించారు. పోప్ లియో XIV సహా అంతర్జాతీయ నాయకులు ట్రంప్ తీరును తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ‘అనవస యుద్ధాల నుంచి అమెరికాను బయటపడేస్తాను‘ అని హామీ ఇచ్చిన ట్రంప్‌కు ఈ ఒత్తిళ్లు వెనక్కిపడేలా చేశాయి.
ఆర్థిక భారం..
పర్షియన్ గల్ఫ్‌లోని హర్మూజ్ జలసంధి నియంత్రణ సాధించడం అమెరికాకు దీర్ఘకాలిక, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ మార్గానే ప్రవహిస్తుంది. ఇక్కడ పట్టు బిగించాలంటే ఇరాన్ భూభాగంలో 600 కి.మీ. ప్రాంతంపై సైన్యం ఉంచాలి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవాలంటే 30 వేల నుంచి 45 వేల మంది సైనికులు, నావికాదళం అవసరం. అఫ్గానిస్తాన్, వియత్నాం యుద్ధాల్లో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు(లక్షల కోట్ల డాలర్లు) ట్రంప్‌ను పునరాలోచనలో పడేశాయి. ఈ ఖర్చు రాజకీయంగా కూడా భారం.
రెండు వారాలు కూల్
రెండు వారాల కాల్పుల విరమణ ట్రంప్‌కు సుపరిచిత కాలవ్యవధి. ఇరాన్‌పై దాడి నిర్ణయానికి ముందు ఆయన ఇచ్చిన గడువు రెండు వారాలే. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు పలుమార్లు ప్రకటించిన సమయం కూడా అంతే. ఆరోగ్య విధానాలు, వాణిజ్య ఒప్పందాల్లో కూడా ఈ ’కూలింగ్ ఆఫ్’ పీరియడ్ ట్రంప్ ఎంపిక. ఇది ఒత్తిళ్లు, ఆచరణాత్మకతలను అంచనా వేసే అవకాశం ఇస్తుంది.
ట్రంప్ బెదిరింపులు ఇరాన్‌ను చర్చలకు ఒప్పించి, తాత్కాలిక విరమణకు దారితీశాయి. కానీ రెండు వారాలు మాత్రమే. ఇది శాశ్వత పరిష్కారం కాదు. చైనా–పాక్ మధ్యవర్తిత్వం, ఆర్థిక భారం, ఆంతరిక రాజకీయ ఒత్తిడి అమెరికాను తగ్గేలా చేశాయి. పశ్చిమాసియాలో ఈ సీజ్‌ఫైర్ షియా–సున్నీ టెన్షన్స్‌ను తగ్గించవచ్చు, కానీ హర్మూజ్ నియంత్రణ లక్ష్యం దూరమైతే అమెరికా వ్యూహం మారుతుంది.