Homeఅంతర్జాతీయంHormuz Strait control Iran Vs US: హర్మూజ్‌ కాదు.. ట్రంప్‌ జలసంధి.. స్వాధీనం అంత...

Hormuz Strait control Iran Vs US: హర్మూజ్‌ కాదు.. ట్రంప్‌ జలసంధి.. స్వాధీనం అంత ఈజీనా?

Hormuz Strait control Iran Vs US: పశ్చిమాసియా యుద్దం ముగియలేదు.. ఇరువైపులా దాడులు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌ ఎనర్జీ కేంద్రాలపై దాడులను మాత్రం ట్రంప్‌ పది రోజులు వాయిదా వేశారు. మరోవైపు చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇంకోవైపు 10 వేల మంది సైనికులను ఇరాన్‌వైపు తరలిస్తున్నారు. ఇంకోవైపు హర్మూజ్‌ జలసంధి ఇక ట్రంప్‌ జలసంధి అని పేర్కొంటున్నారు. దానిని అమెరికా–ఇరాన్‌ కలిసి నిర్వహిస్తామని ప్రకటించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన రాజకీయ ప్రకటనలు మాత్రమే. అంతర్జాతీయ చట్టం లేదా భౌగోళిక వాస్తవాల ప్రకారం ఇవి అమలులో లేవు. ఇరాన్‌ తన భౌగోళిక ఆధిక్యతను ఉపయోగించి ఈ జలసంధిపై నియంత్రణను కొనసాగిస్తూ, శత్రు నౌకలను నిషేధించి, మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తోంది.

ట్రంప్‌ ప్రకటనల్లో వాస్తవం ఎంత?
ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదికగా హర్మూజ్‌ను అమెరికా–ఇరాన్‌ సంయుక్తంగా నియంత్రిస్తామని, తాను–ఇరాన్‌ కలిసి దీనిని నడుపుతామని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు గతంలో గ్రీన్‌లాండ్‌ కొనుగోలు, కెనడాను 51వ రాష్ట్రంగా మార్చడం వంటి ప్రకటనలుగానే భావిస్తున్నారు. ఇవి అమలు కాని రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే. హర్మూజ్‌ను 48 గంటల్లో తెరవాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని బెదిరించారు. నాటో దేశాలు యుద్ధంలోకి రావాలని పిలుపు ఇచ్చాడు. చర్చలు జరుగుతున్నాయని ప్రకటించినా, ఇరాన్‌ మాత్రం అధికారిక చర్చలు ఏమీ జరగలేదని తేల్చి చెప్పింది.

ఇరాన్‌ వాస్తవ నియంత్రణ..
ఒమన్‌ – ఇరాన్‌ మధ్య ఉన్న ఈ జలసంధి ఇరాన్‌ తీరానికి అతి సమీపంలో ఉంది, దీని వద్ద ఇరాన్‌ అత్యాధునిక క్షిపణులు, సీమైన్స్, రక్షణ వ్యవస్థలను మోహరించింది. హర్మూజ్‌ గుండా వెళ్లే కొన్ని నౌకల నుంచి 2 మిలియన్‌ డాలర్ల టోల్‌ వసూలు చేయడం ప్రారంభిస్తామని ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలను పూర్తిగా నిషేధించింది. ఐదు మిత్ర దేశాల నౌకలకు మాత్రమే అనుమతిస్తోంది. అమెరికా తమ విద్యుత్‌ కేంద్రాలపై దాడి చేస్తే, హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని స్పష్టం చేసింది. పరిస్థితి మరింత విషమిస్తే రెడ్‌ సీని కూడా మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

చమురు సరఫరాపై ప్రభావం
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20–30 శాతం హర్మూజ్‌ గుండానే వెళ్తుంది. ఇరాన్‌ ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతాయి, ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు.ఈ కారణంగానే అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు ఈ జలసంధిని తెరిచి ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

యుద్ధంలోకి హౌతీలు..
ఇరాన్‌ మిత్రుడైన యెమన్‌ హౌతీలు ఎర్ర సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్‌ నౌకలపై దాడులు చేస్తున్నారు, ఇది సంఘర్షణను మరింత విస్తరింపజేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్‌ సాయంతో ఇరాన్‌పై దాడులు చేస్తుండగా, ఇరాన్‌ తన మిత్ర శక్తుల ద్వారా పరోక్ష యుద్ధాన్ని సాగిస్తోంది.

ట్రంప్‌ ప్రకటనలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి, దేశీయ రాజకీయ లాభాల కోసం చేసినవిగా కనిపిస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధి ఇరాన్‌ పూర్తి నియంత్రణలోనే ఉంది. దీనిని స్వాధీనం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. భౌగోళిక పరిస్థితులు కూడా ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular