Donald Trump Attacks: డొనాల్డ్ ట్రంప్.. అగ్రదేశం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు. ఆయన బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచింది. పాలన తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంటా, బయట ఆయన నిర్ణయాలు ఎవరికీ నచ్చడం లేదు. ఏడాది పాలనకే అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన అధ్యక్షుడిగా ట్రంప్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. మరోవైపు ట్రంప్‌పై దాడులు కూడా జరుగుతున్నాయి. ఏడాదిలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళనను రేపుతోంది. ఏప్రిల్ 25న వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన దాడి తర్వాత కొద్ది కాలంలోనే మరో ఘటన జరగడం భద్రతా వ్యవస్థల సామర్థ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి చొరబడిన సాయుధుడిని సీక్రెట్ సర్వీస్ హతమార్చిన ఘటన కూడా ఈ సిరీస్‌లో భాగమే.
తాజా ఘటన ఇలా..
వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన దాడి అధ్యక్షుడు హాజరైన కార్యక్రమంలోనే జరగడం ఈ దాడుల తీవ్రతను సూచిస్తోంది. ఫిబ్రవరి ఘటనలో ట్రంప్ అక్కడ లేకపోవడం ఒక్కటే అప్పట్లో పెద్ద నష్టాన్ని నివారించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ట్రంప్–ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై 58 మిలియన్ డాలర్ల బౌంటీ ప్రకటించాలని చర్చిస్తున్నట్లు వచ్చిన రిపోర్టులు అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ వరుస ఘటనలు ఒక సాధారణ ట్రెండ్ కాదు. రాజకీయ ధ్రువీకరణ, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న తీవ్రమైన ద్వేషం, అంతర్జాతీయ శత్రుత్వాలు కలిసి ఒక ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది.
కుట్రా? వ్యవస్థాగత వైఫల్యమా?
ఈ దాడుల వెనుక కుట్ర ఉందా అన్న అనుమానం సహజం. ముఖ్యంగా ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతలు, గతంలో జరిగిన సంఘటనలు ఈ సందేహాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా ఏ విదేశీ శక్తి ప్రమేయం బయటపడలేదు. చాలాసార్లు ఇలాంటి దాడులు ఒంటరి వ్యక్తులు చేసే ‘లోన్ వుల్ఫ్’ అటాక్‌లుగా బయటపడతాయి. కానీ వరుసగా మూడు ఘటనలు జరగడం సాధారణం కాదు. అమెరికాలో రాజకీయ హింస పెరగడం దీర్ఘకాలిక సమస్య. ట్రంప్ వ్యక్తిత్వం, వారి విధానాలు అనేక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ఇది వ్యక్తులను హింసాత్మక చర్యలకు పురికొల్పుతున్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా, ఆయుధాల సులభ లభ్యత, సామాజిక మాధ్యమాల్లో ఉద్రిక్తతలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి.
భద్రతా సవాళ్లు…
క్రెట్ సర్వీస్‌తో సహా అమెరికా భద్రతా ఏజెన్సీలు ఎంతో అప్రమత్తంగా ఉన్నా, ఈ వరుస ఘటనలు వారి వ్యవస్థలో కొన్ని లోపాలను బయటపెడుతున్నాయి. అధ్యక్షుడి భద్రత అనేది దేశం జాతీయ భద్రతకు సమానం. ఈ ఘటనలు భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించి, మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి.
ట్రంప్‌పై వరుస దాడులు అమెరికా రాజకీయ వ్యవస్థలోని లోతైన విభజనను, హింసా సంస్కృతి పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. ఇవి కుట్ర కావచ్చు లేదా వ్యక్తిగత ద్వేషం నుంచి పుట్టిన చర్యలు కావచ్చు. కానీ కారణం ఏదైనా ఇలాంటి హింసాత్మక చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ నాయకుల భద్రతకు ముప్పు. అమెరికా ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, రాజకీయ విభేదాలను సంభాషణ ద్వారా పరిష్కరించే వాతావరణాన్ని సృష్టించాలి. లేనిపక్షంలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే ప్రమాదం ఉంది.
