Pakistan Crisis: భారత్ కొట్టిన దెబ్బకు ఆర్థికంగా కుదేలైన మన దాయాది దేశం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా అప్పులు చేసింది. తాజాగా ఇటీవలే ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణం తీసుకుంది. చేసిన అప్పుల్లో ఎక్కువభాగం ఆర్మీ, ఉగ్రవాదులకే కేటాయిస్తోంది. దీంతో జీవన ప్రమాణాలు మెరుగుపడకపోగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణలు రెండు దేశాల ప్రజల జీవనాన్ని కుదిపేశాయి. అక్టోబర్ 11 నుంచి ఇరుదేశాలు తమ సరిహద్దులను మూసివేయడంతో, సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ వాణిజ్య మార్గాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది.
మండుతున్న నిత్యావసర ధరలు..
సరిహద్దు మూసివేత తర్వాత మార్కెట్లలో సరఫరా లోటు తీవ్రమైంది. టమాటాలు, ఆపిల్ పండ్లు వంటి కీలక పంటల ధరలు దూసుకుపోతున్నాయి. పాకిస్తాన్ నగరాల్లో టమాటా ధర కిలోకు 600 రూపాయల దాకా చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు నివేదించాయి. సాధారణ వినియోగదారుల ఖర్చులు మూడింతలు పెరగడంతో, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కోట్ల రూపాయల నష్టం..
ఇరుదేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం సంవత్సరానికి సుమారు 2.3 బిలియన్ డాలర్ల మేర కొనసాగుతుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలతో రవాణా, ధాన్య సరఫరా, వ్యాపార లావాదేవీలు మొత్తం నిలిచిపోయాయి. కాబూల్‌లోని పాక్–అఫ్గాన్ వాణిజ్య మండలి అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రోజుకు కనీసం ఒక మిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం నమోదవుతోంది. సరిహద్దు వద్ద నిలిచిపోయిన వేలాదిమంది ట్రక్ డ్రైవర్లు, వ్యాపారులు తాత్కాలిక శిబిరాల్లో చిక్కుకుపోయారు. సుమారు ఐదు వేల కంటైనర్లు రెండు వైపులా ఆగిపోయి, పెద్ద మొత్తంలో కూరగాయలు పాడైనట్లు అధికారులు తెలిపారు.
శాంతి ఒప్పందం కుదిరినా..
ఇటీవల జరిగిన కాల్పుల్లో రెండు దేశాల సైనికులతోపాటు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద దాడుల ముప్పు కూడా పెరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఖతార్ రాజధాని దోహాలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, అఫ్గాన్ రక్షణాధిపతి ముల్లా యాకుబ్ చర్చలు జరిపారు. దాంతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ సరిహద్దు వ్యాపారం తిరిగి ప్రారంభం కావడం ఆలస్యమవుతోంది. ఈ నెల 25న ఇస్తాంబుల్‌లో జరగనున్న కొత్త చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు కీలకమవనున్నాయి.