Sheikh Hasina: బంగ్లాదేశ్ లో నెలకొన్న అస్థిర పరిస్థితుల వల్ల ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. శాంతిభద్రతలు క్షీణించిన నేపథ్యంలో ఆమె తన మాతృదేశాన్ని వదిలిపెట్టి భారత్ వచ్చేశారు. పశ్చిమ బెంగాల్లోని హిండన్ విమానాశ్రయంలో సోమవారం ఆమె విమానం ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఆమె జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ గంటపాటు పలు విషయాలపై చర్చించుకున్నారు.. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితిలో నెలకొన్నాయి. దీంతో ప్రధాన పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. దీంతో ఆమె భారత్ వచ్చేసారు. అయితే ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లిపోతారని జాతీయ మీడియాలో కథనాలు వినిపించాయి. అయితే ఇప్పట్లోగా ఆమె లండన్ వెళ్లే అవకాశం లేదని, కొంతకాలం పాటు భారత్ లోనే ఉంటారని ప్రచారం జరుగుతోంది.
షేక్ హసీనా తనను తాను రాజకీయ శరణార్థిగా ప్రకటించుకున్నారు. లండన్ లో ఆశ్రయం ఇవ్వాలని ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇంగ్లాండ్ ప్రభుత్వం నుంచి తదుపరి అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్ లోనే ఉంటారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆమెకు అనుమతులు ఇచ్చింది. ఇదే సమయంలో ఆమెకు సంస్థా గతంగా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. “బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై అత్యంత సునిశితంగా పరిశీలిస్తున్నాం. అక్కడి భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే హసీనాతో కూడా మాట్లాడింది. తదుపరి ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పటివరకైతే హసీనా మన దేశంలోనే ఉంటారని” కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇంగ్లాండ్ సరికొత్త డిమాండ్
హసీనా తనను రాజకీయ శరణార్థిగా ప్రకటించాలని కోరిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ ప్రభుత్వం స్పందించింది..”రెండు వారాలుగా బంగ్లాదేశ్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. హింసాత్మక సంఘటన వల్ల ప్రాణనష్టం సంభవించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలి. ప్రభుత్వ మార్పును ప్రజలు శాంతియుతంగా జరిగేలా కృషి చేయాలని” ఇంగ్లాండ్ విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇందులో షేక్ హసీనాకు తమ దేశం ఆశయం ఇచ్చే అంశాన్ని ఆయన వెల్లడించలేదు. మరోవైపు షేక్ హసీనా సోదరి రెహానా యూకే పౌరు రాలిగా ఉంది. ఆమె కుమార్తె తులిఫ్ అక్కడి లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇంగ్లాండులో ప్రస్తుతం లేబర్ పార్టీ అధికారంలో ఉంది. అందువల్లే హసీనా లండన్ వెళ్లేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ఇంగ్లాండు ప్రభుత్వానికి విన్నవించారు.
హసీనా భారత్ రావడం.. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. భారత ప్రభుత్వం వీటిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రంలో ఉన్న మేఘాలయలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. అంతర్జాతీయ సరిహద్దు పక్కన 24 గంటల పాటు భద్రతా దళాలు పహారా కాస్తున్నాయని, చొరబాట్లను నిరోధించేందుకు తాము ఈ చీరలు తీసుకున్నామని మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ప్రజలను రెచ్చగొట్టే వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అలాంటి వాటివల్ల బెంగాల్ రాష్ట్రంలో అశాంతి రగులుతుందని, అది అంతిమంగా శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.