Israel – Iran War : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్ పై యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. దాడులు షురూ..

పశ్చిమాసియాలో యుద్ధం ఆగడం లేదు. ఏడాది క్రితం ఇజ్రాయెల్‌ హమాస్‌ అంతమే లక్ష్యంగా ప్రారంభించిన యుద్ధం.. క్రమంగా విస్తరిస్తోంది. హమాస్‌ తర్వాత హెజ్‌బొల్లాను టార్గెట్‌ చేసిన ఐడీఎఫ్‌ ఇప్పుడు ఇరాన్‌పై ప్రతీకార దాడులు మొదలు పెట్టింది.

Written By: Raj Shekar, Updated On : October 26, 2024 2:27 pm

Israel - Iran War

Follow us on

Israel – Iran War :  పశ్చిమాసియాలో శాంతి ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకవైపు హమాస్‌తో సంధికి సిద్ధమైన ఇజ్రాయెల్‌.. ఇంకోవైపు ఇరాన్‌ను టార్గెట్‌ చేసింది. ఇరాన్‌ గతంలో చేసిన దాడులకు ప్రతీకారంగా ఐడీఎఫ్‌ దాడులు మొదలు పెట్టింది. ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. ఇరాన్, దాని మద్దతుదారులు అక్టోబర్‌ 7 నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉంది. మా దేశాన్ని మేం రక్షించుకుంటాం.. అందుకు ఏదైనా చేస్తాం అని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. జనరల్‌ స్టాఫ్‌ చీఫ్‌ ఎల్‌జీ హెర్జి హలేవీ నాయకత్వంలో ఈ ప్రతీకారదాడులు చేస్తున్నట్లు ఐడీఎఫ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఇజ్రాయెల్‌ వైమానికదళం కమాండింగ్‌ అధికారి మేజర్‌ జనరల్‌ టోమర్‌ బార్‌తో కలిసి క్యాంపు రాబిన్‌లోని ఇజ్రాయెల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి దాడులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

క్షిపణి ప్లాంట్లు టార్గెట్‌..
ఇరాన్‌ సైనిక స్థావరాలతోపాటు క్షిపణి తయారీ కేంద్రాలను ఐడీఎఫ్‌ టార్గెట్‌ చేసింది. ఈ క్షిఫిణులతో తమ పైరులకు తక్షణం ముప్పు పొంచి ఉందని ఐడీఎఫ్‌ భావిస్తోంది. అందుకే వాటిని ధ్వంస చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ప్రస్తుతానికి ఇరాన్‌పై తమ దాడులు ముగించినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడుల కారణంగా టెహ్రాన్‌లో ఎంత నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అటు ఇరాన్‌ ఇంకా వీటిపై స్పందించలేదు. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. ఈమేరకు ఓ అధికారి ప్రకటన చేశారు. మరోవైపు ఈ దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు తెలిసింది.

విమాన రాకపోకలకు అంతరాయం..
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌ పొరుగున ఉన్న ఇరాక్‌ తమ దేశంలోని విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఇరాక్‌ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ విమాన రాకపోకలు నిలిపివేసినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఇరాన్‌ కూడా తమ దేశంలో విమాన రాకపోకలను నిలిపివేసింది. ఇదిలా ఉంటే.. హెజ్‌బొల్లా చీఫ్‌ హత్యకు నిరసనగా ఇరాన్‌ అక్టోబర్‌ 1న బాలిస్టిక్‌ క్రిపుణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. వీటిలో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలిన వాటిని డిఫెన్స్‌ వ్యవస్థలు అడ్డుకున్నాయి. దీనికి ప్రతీకార చర్య ఉంటుందని ఇజ్రాకెల్‌ అప్పట్లోనే ప్రకటించింది. తాజాగా దాడులు మొదలు పెట్టింది.