UK Parliament Dissolved: బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా బ్రిటన్ పార్లమెంటును గురువారం(మే 30న)రద్దు చేశారు. పార్లమెంటు రద్దు నేపథ్యంలో ఐదు వారాల్లో ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఐదు వారాల ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది.
ముందస్తు ఎన్నికలకు సునాక్..
జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే మే 23న ఆయన తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించామన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు.
650 మంది సభ్యులు..
ఇదిలా ఉండగా బ్రిటర్ పార్లమెంటులో 650 మంది సభ్యులు ఉన్నారు. 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఇక రెండేళ్ల క్రితం బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సొంత పార్టీ నేతలకు కూడా నచ్చలేదు. సొంత పార్టీ ప్రతినిధులే విమర్శలు చేశారు. ఈ క్రమంలో సునాక్ ముందస్తు ప్రకటన చేశారు.
ఎన్నికలకు 129 మంది దూరం
మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 129 మంత్రి ప్రతినిధులు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో సునాక్‌కి ఎన్నికలు మరో పరీక్షగా మారనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో సునాక్ తన పార్టీని ఎలా గెలిపించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.