Homeఅంతర్జాతీయంPakistan AQ Khan: మోస్సాద్‌ టార్గెట్‌ నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు.. ఈ అణుదొంగ.. స్పెషల్...

Pakistan AQ Khan: మోస్సాద్‌ టార్గెట్‌ నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు.. ఈ అణుదొంగ.. స్పెషల్ స్టోరీ

Pakistan AQ Khan: మోస్సాద్‌.. ప్రపంచంలో అన్నిదేశాలకు దీనిగురించి తెలుసు. ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. అగ్రరాజ్యం అమెరికా గూడచార సంస్థ కూడా ఇంత సమర్థవంతంగా పనిచేయదంటారు నిపుణులు. మొస్సాద్‌ టార్గెట్‌ చేసిందటే మట్టుపెట్టే వరకూ వదిలిపెట్టదు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ అణు పితామహుడు అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ (ఏ.క్యూ. ఖాన్‌) మోస్సాద్‌ టార్గెట్‌గా మారాడు. 2000 సంవత్సరంలో ఖాన్‌ను మట్టుపెట్టాలని మొస్సాద్‌ రహస్య యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించింది, దీనికి ‘కిడాన్‌’ (హిబ్రూ భాషలో ‘ఈటె’ అని అర్థం) అనే పేరు పెట్టింది. ఈ ప్రణాళిక ఇరాన్‌తో పాకిస్తాన్‌ అణు సహకారం ఆపడానికి ఉద్దేశించబడింది. అయితే, అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా ఈ మిషన్‌ విఫలమైంది. ఈ ఘటన ఖాన్‌ అణు వ్యాపారం, అంతర్జాతీయ గూఢచర్య రాజకీయాలను వెలుగులోకి తెచ్చింది.

ఖాన్‌ ఎందుకు టార్గెట్‌ అయ్యాడు?
అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ను అణు శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. 1974లో భారతదేశం ‘స్మైలింగ్‌ బుద్ధ’ అణు పరీక్ష తర్వాత, ఖాన్‌ పాకిస్తాన్‌లో ఖాన్‌ రీసెర్చ్‌ లాబొరేటరీస్‌ (కేఆర్‌ఎల్‌) స్థాపించి, యురేనియం సంవర్ధన టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. అయితే, అతను ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా వంటి దేశాలకు అణు టెక్నాలజీని రహస్యంగా అందించాడనే ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్, ఇరాన్‌ను తన ప్రధాన శత్రుదేశంగా భావించి, ఖాన్‌ ఇరాన్‌కు అణు సాయం అందిస్తున్నాడని ఖాన్‌ను అనుమానించింది. ఈ నేపథ్యంలో మోస్సాద్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేసింది. మట్టుపెట్టడం ద్వారా అణు సహకారాన్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2000లో, ఖాన్‌ ఒక దక్షిణాసియా దేశానికి పర్యటనకు వెళ్లిన సమయంలో అతన్ని హత్య చేయడానికి ‘కిడాన్‌’ మిషన్‌ను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా, మోస్సాద్‌ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఖాన్‌ కదలికలపై నిశిత నిఘా ఉంచడం జరిగింది. మాజీ మోస్సాద్‌ చీఫ్‌ షబ్తాయ్‌ షావిత్‌ 2023లో ఒక ఇంటర్వ్యూలో, ఖాన్‌ ఉద్దేశాలు స్పష్టంగా తెలిసి ఉంటే, అతన్ని హత్య చేయమని ఆదేశించేవాడినని, అది చరిత్ర గతిని మార్చేదని వెల్లడించాడు.

అమెరికా జోక్యం.. ఖాన్‌కు రక్షణ
ఖాన్‌ను హత్య చేయాలన్న మోస్సాద్‌ ప్రణాళిక అమెరికా జోక్యంతో విఫలమైంది. అప్పటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్, అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు ఖాన్‌ ఇతర దేశాలకు అణు సాంకేతికత అందించడాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాడు. ఈ హామీతో, అమెరికా మోస్సాద్‌ను ఈ మిషన్‌ను ఆపమని కోరింది. అంతర్జాతీయ సంబంధాలు, భద్రతా కారణాల దృష్ట్యా మోస్సాద్‌ ఈ ఆపరేషన్‌ను నిలిపివేసింది. ఈ ఘటన మోస్సాద్‌ చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది, ఎందుకంటే ఒకసారి లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత వెనక్కి తగ్గడం మోస్సాద్‌కు తగ్గదు. కానీ ఖాన్‌కు అమెరికా రక్షణగా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణభిక్ష పెట్టింది.

అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ కేవలం పాకిస్తాన్‌ అణు కార్యక్రమానికి మాత్రమే సహకరించలేదు, అణు టెక్నాలజీని అంతర్జాతీయ బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1980 చివరలో, అతను ఇరాన్‌కు గ్యాస్‌ సెంట్రిఫ్యూజ్‌ టెక్నాలజీని రహస్యంగా అందించాడు, ఇది ఇరాన్‌ యొక్క యురేనియం సంవర్ధన కార్యక్రమానికి ఆధారం అయింది. అదే విధంగా, లిబియా, ఉత్తర కొరియాకు కూడా అణు సాంకేతికతను సరఫరా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. 2003లో, లిబియా తన అణు కార్యక్రమాన్ని విడనాడడంతో ఖాన్‌ నెట్‌వర్క్‌ బయటపడింది, దీనితో అతను 2004లో గృహ నిర్బంధానికి గురయ్యాడు. అయినప్పటికీ, పాకిస్తాన్‌లో అతను జాతీయ వీరుడిగా గౌరవం పొందాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular