Saudi Arabia : ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే అది ఏదైనా ప్రమాదమే. అందుకే ఏదైనా మితంగా ఉండాలని పెద్దలంటుంటారు. అయితే ఇతడి విషయంలో ఆ పదం తప్పిపోయింది. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా అతడు పేరు పొందాల్సి వచ్చింది. ఏకంగా 610 కిలోల భారీ శరీరంతో ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న వ్యక్తిగా అతడు రికార్డ్ సృష్టించాడు. అంతటి బరువు ఉండడంతో ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండేది. మూడు సంవత్సరాలు పాటు అతడు మంచానికే పరిమితం అయ్యాడు. విపరీతమైన బరువు వల్ల కనీసం తన వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోయేవాడు. ప్రతి చిన్న పనికి కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మీద ఆధారపడేవాడు. అయితే అతని దుస్థితిపై మీడియాలో విపరీతమైన కథనాలు ప్రసారమయ్యాయి. ఆ విషయం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా చెవికి చేరింది. దీంతో ఆయన రంగంలోకి దిగాడు.
రాజు రంగంలోకి దిగడంతో
అలా 610 కిలోల బరువు ఉన్న వ్యక్తి పేరు ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ. అతడి పరిస్థితి తెలుసుకున్న సౌదీ అరేబియా రాజు 30 మంది ప్రఖ్యాతమైన వైద్య నిపుణుల బృందాన్ని అతని వద్దకు పంపించాడు. ఏకంగా రాజు పంపించడంతో వారు యుద్ధ ప్రాతిపదికన చికిత్స మొదలుపెట్టారు. అతడిని ప్రత్యేకమైన మంచం మీద పడుకోబెట్టారు. లిఫ్ట్ ద్వారా రియాజ్ ప్రాంతంలోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు . అక్కడ అతడికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించారు. చాలాకాలం పాటు అదరికి ప్రత్యేకమైన ఆహారం అందించారు. వ్యాయామం చేయించారు. విస్తృతంగా చికిత్స అందించారు.. ఫలితంగా మొదటి ఆరు నెలల్లో ఖలీద్ 305 కిలోల బరువు తగ్గాడు. తర్వాత అతడు ఆరోగ్యం మరింత మెరుగెందుకు వైద్యులు ఫిజియోథెరపీ చేయించారు. అలా దాదాపు 12 సంవత్సరాల తర్వాత అంటే 2023 చివరి నాటికి అతడు 63.5 కిలోల బరువుకు చేరుకున్నాడు. ఏకంగా 546.5 కిలోల బరువు తగ్గాడు. బరువు తగ్గిన తర్వాత ఇన్ని రోజులపాటు అదనంగా పెరిగిన అతడి చర్మాన్ని తొలగించేందుకు వైద్యులు అనేక రకాల శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం అతడు ఫిట్ గా ఉన్నాడు. బరువు తగ్గడంతో అతడు నవ్వుతూ కనిపిస్తున్నాడు. దీంతో అతనికి వైద్యులు స్మైలింగ్ పర్సన్ అనే బిరుదు ఇచ్చారు.
బరువు ఎలా తగ్గాడంటే
అధికంగా బరువు ఉన్నప్పుడు ఖలీద్ తీవ్రంగా ఇబ్బంది పడేవాడు. శ్వాస తీసుకోవడం కూడా అతనికి కష్టం అయ్యేది. తినడానికి కూడా ఇబ్బంది పడేవాడు. మంచంలో పడుకుని ఉండటం వల్ల అతని వీపు భాగానికి గాయాలయ్యాయి. దీనికి తోడు చర్మం విపరీతంగా పెరగడంతో.. అనేక వ్యాధులతో సతమతమయ్యేవాడు. ఒకానొక దశలో చనిపోతే బాగుండు అనే నిర్ణయానికి వచ్చాడు. సౌదీ రాజు అతనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. చికిత్స అందేలా కృషి చేశారు. వాస్తవానికి ప్రపంచంలో ఈ స్థాయిలో బరువు తగ్గిన వ్యక్తి మరొకరు లేరు. బరువు తగ్గడం కోసం వైద్యులు చెప్పిన నిబంధనలను ఖలీద్ తూచా తప్పకుండా పాటించాడు. ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నాడు. దాదాపు 11 సంవత్సరాల వరకు అతడి ఆహారంలో ఉప్పు, కారం, ఇతర దినుసులు ఉండేవి కావు. దుంపలు, కార్బోహైడ్రేట్లు ఇచ్చేవారు కాదు. కేవలం ప్రోటీన్ ఆహారం మాత్రమే.. అది కూడా మోతాదులోనే ఇచ్చేవారు. ఫిజియోథెరపీ కూడా అతడు బరువు తగ్గడానికి ఉపకరించింది.. బరువు తగ్గిన తర్వాత ఖలీద్ అత్యంత సంతోషంగా కనిపిస్తున్నాడు.. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతోందని పేర్కొంటున్నాడు. బరువు తగ్గిన తర్వాత అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉన్నాయి.